కొంగర కలాన్ లో కొత్త కేసిఆర్… ఏందబ్బా ఈ ట్విస్ట్

‘‘కేసిఆర్ మాట్లాడితే సింహం నడిచినట్లుంటది.. ఇప్పుడేంది సప్పగా ఉంది అని అనుకుంటున్నరు కదా?’’ అని ఇటీవల కాలంలో ఒక సభలో సిఎం కేసిఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అప్పుడు సప్పగా ఉందో లేదో కానీ కొంగర కలాన్ ప్రగతి నివేదన సభలో మాత్రం కేసిఆర్ స్పీచ్ చప్పగా ఉన్నది. ఎంత సప్పగా అంటే ఉద్యమ నేతగా ఉన్నప్పటినుంచి మొదలుకొని సిఎంగా నాలుగేళ్ల కాలంలో ఎన్నడూ లేనంత సప్పగా కేసిఆర్ స్పీచ్ సాగింది.

పంచ్ డైలాగులతో విరుచుకుపడే కేసిఆర్ స్పీచ్ నిస్తేజంగా, నిస్సారంగా సాగింది. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చే కేసిఆర్ స్పీచ్ పస లేకుండా సాగింది. చవటలు, సన్నాసులు, దద్దమ్మలు, దగుల్బాజీలు, పోరంబోకులు, పనికిమాలినోళ్లు, బేకార్ గాళ్లు, హౌలేగాళ్లు లాంటి తిట్ల భాషకు ప్రగతి నివేదన సభ సాక్షిగా కేసిఆర్ తిలోదకాలు ఇచ్చారా అన్న అనుమానం కలిగేలా ప్రసంగం సాగింది.

ప్రత్యర్థి పార్టీలను, ప్రత్యర్థి పార్టీల నాయకుల పేరు పెట్టి ఉతికి ఆరేసే పాత కేసిఆర్ ఎటు పోయిండబ్బా అని అభిమానులు, కార్యకర్తలు డైలామాలో పడేలా మాట్లాడారు కేసిఆర్. లంకల పుట్టినోళ్లంతా రాక్షసులే.. ఆంధ్రా నేతలంతా రాక్షసులే అన్నంత కసి కసి డైలాగులు ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రగతి సభ వేదికగా కేసిఆర్ నోట రాలేదు. అంతెందుకు ప్రత్యర్థి పార్టీలను కానీ, ప్రత్యర్థి పార్టీల నాయకుల పేర్లను కానీ ఉచ్ఛరించకుండా సప్పటి ప్రసంగం చేశారు కేసిఆర్.

సభలో స్పీచ్ ఆరంభంలోనే ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా కాలాన్ని ఉదహరిస్తూ మాట్లాడారు. ఆ సమయంలో ఘాటైన పదాలు నోటినుంచి వచ్చినా ఎక్కడ కూడా చంద్రబాబు పేరు తీసుకోవడానికి కేసిఆర్ సంకోచించారు. స్పీచ్ చివర్లో కాంగ్రెస్, జెఎసి ల ప్రస్తావన చేసినా వారి పేర్లు కానీ, ఆ పార్టీ పేరు కానీ తీసుకునే సాహసం చేయలేకపోయారు. ప్రతీపశక్తులు,  ఢిల్లీకి గులాంగిరీ అంటూ మాట్లాడినా ఆ మాటల్లో పదును లోపించింది. కరుకుదనం తగ్గింది. వాడి వేడి లేకుండా సాగింది.

ముందస్తు, వెనకస్తు అంటూ పార్టీ నేతలు ఒకవైపు లీకులు ఇస్తుంటే వాటిని పత్రికల్లో పతాక శీర్షికల్లో రాస్తున్నారు మీడియా వారు. కానీ లక్షలాది మందిని తరలించి సభా వేదికగా ముందస్తా, వెనకస్తా అన్నది స్పష్టమైన ప్రటకన చేస్తారని కార్యకర్తలు, నాయకులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ కేసిఆర్ నోట ఆ మాటేమీ రాలేదు. తెలంగాణ ప్రజలకు ఏది మంచిదైతే అదే చేస్తామని ముక్తసరిగా మాట్లాడారు.

సభలో మాట్లాడిన మాటల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్తది లేదు. పాత పథకాలను వల్లె వేశారు. పాత ముచ్చట్లే మళ్లీ చెప్పారు. అదేంటి సభలో కొత్త నిర్ణయాలు ప్రకటిస్తారని మీడియా వారు రాశారు కానీ.. నేను ప్రకటించను అంటూ మొండికేశారు. మేనిఫెస్టో కమిటీ అన్ని విషయాలు చూసుకుంటుంది అంటూ కేకే మీద భారం మోపారు. ఒక్క కొత్త మాట కూడా చెప్పకుండానే స్పీచ్ ముగించేశారు. 

కేసిఆర్ తిట్ల భాష మంచిదా, చెడ్డదా పక్కన పెడితే కేసిఆర్ మాత్రం ఆ భాషతోనే పాపులర్ అయ్యారు. ఆ భాషతోనే తెలంగాణ సాధించారు. ఆ భాషతోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. ఆ భాషతోనే ప్రత్యర్థి పార్టీలను భయభ్రాంతులకు గురి చేశారు. తన జీవితంలో ఇంతటి ప్రగతి సాధించడానికి కారణం కేసిఆర్ నోరే. ఆయన నోటినుంచి వచ్చే పంచ్ లు, తూటాల్లాంటి మాటలే. మరి ప్రగతి సభలో ఆమాటలేవి? ఆ తూటాలేవి?  అసలు పాత కేసిఆర్ ఏడి? ఇయ్యాల ప్రగతి సభలో కొత్త కేసిఆర్ అగుపిస్తుండేంది అని కార్యకర్తలు మాత్రం మనసుల్లో అనుకోక తప్పని స్పీచ్ ఇచ్చారు గులాబి దళపతి.

ప్రత్యర్థులను భయపెట్టేందుకు, వారి ఆత్మస్థైర్యం దెబ్బ తీసేందుకు 25 లక్షల మందితో ప్రగతి సభ పెట్టాలని ఆరాటపడ్డారు కానీ.. ఆ సభికులను రంజింపజేయడంలో, కంకణబద్ధులను చేయడంలో కేసిఆర్ విపలమయ్యారని ప్రచారం షురూ అయింది. కేసిఆర్ మొహంలో ఎందుకో పాత కసి కనిపించలేదని, బెరుకు బెరుకుగా మాట్లాడినట్లుందని కార్యకర్తల్లో టాక్ షురూ అయింది.