ఫిబ్రవరిలో ఏం జరగబోతోంది ? టిడిపిలో టెన్షన్

ఇపుడిదే టెన్షన్ చంద్రబాబునాయుడులో పెరిగిపోతోందిట. ఒకవైపు  ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు బద్దశతృవులు రాష్ట్ర పర్యటనలకు వస్తున్నారు. అంటే ఎన్నికలు రావటానికి ఇంకా సుమారు మూడు నెలలు ఉందనుకోండి అది వేరే సంగతి. ఎప్పుడో వచ్చే ఎన్నికల టెన్షన్ కన్నా ఈ నెలలో వస్తున్న ఇద్దరు శతృవుల టెన్షనే చంద్రబాబులో పెరిగిపోతోందట. ఈనెల 14వ తేదీన తెలంగాణా ముఖ్యమంత్రి కెసియార్ అమరావతికి వస్తున్నారు. అంతకన్నా ముందుగానే అంటే 10వ తేదీనే ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు.

ప్రస్తుతం ఇద్దరిపైనా చంద్రబాబు ఏ రేంజిలో విరుచుకుపడుతున్నారో అందరూ చూస్తున్నదే. ఈ నేపధ్యంలో నరేంద్రమోడి, కెసియార్ రాష్ట్రానికి వస్తున్నారంటే చంద్రబాబుకు ఇబ్బందే కదా ? ఇబ్బంది ఎందుకంటే, ఏపి ఎన్నికల సందర్భంగా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కెసియార్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.  మరి ఆ గిఫ్ట్ ఏమిటి అనే విషయం సస్పెన్పే అయినా తేదీ  మాత్రం దాదాపు ఖాయమైనే తెలుస్తోంది. ఫిబ్రవరి 14వ తేదీన కెసియార్ అమరావతికి వస్తున్నారు.

అమరావతి పరిధిలోని నేలపాడు గ్రామం బైపాస్ రోడ్డుకు దగ్గరలో జగన్ సొంత ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు.  14వ తేదీ ఉదయం గృహప్రవేశం పెట్టుకున్నారట. ఆ కార్యక్రమానికి కెసియార్ ప్రత్యేక అతిధిగా వస్తున్నారు. ఎటూ అమరావతికి వస్తున్నపుడు రాజకీయాలు మాట్లాడకుండా ఉంటారా ? రాజకీయాలన్నాక చంద్రబాబే కదా కేంద్ర బిందువు ? ఆ విషయమే చంద్రబాబులో టెన్షన్ పెంచేస్తోందట. బహుశా కెసియార్ ఇవ్వదలచుకున్న రిటర్న్ గిఫ్ట్ అదే రోజు బయటపెడతారేమో అన్నదే ఆందోళన.

ఇక బిజెపి విషయం చూస్తే మోడి గుంటూరు పర్యటనకు వస్తున్నారు. 10వ తేదీ బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. బహిరంగసభ అన్నాక అందులోను రాజధాని జిల్లాకు వచ్చిన తర్వాత చంద్రబాబు గురించి మోడి మాట్లాడకుండా ఉంటారా ? తనపై చంద్రబాబు చేస్తున్న ప్రతీ ఆరోపణకు మోడి డీటైల్డుగా సమాధానం చెబుతారట. పనిలో పనిగా చంద్రబాబుపై మోడి ఎదురుదాడి కూడా చేస్తారనటంలో సందేహం అక్కర్లేదు. ఎందుకంటే, ఎన్నికల సీజన్ కదా ? కాబట్టి చంద్రబాబు బదులు తీర్చుకోవటానికి మోడి అన్నీ అస్త్రాలతో వస్తున్నట్లు సమాచారం. అందుకే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోందట.