ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ… 2019లో అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లపాటు అధికారాన్ని అనుభవించారు నాయకులు! వైసీపీకి ఆ స్థాయిలో భారీ విజయం కట్టబెట్టిన ప్రజలకు జగన్ డీబీటీ ల రూపంలో న్యాయంచేశారు! మరి ఆ స్థాయి విజయం దక్కడంలో కీలక భూమిక పోషించిన కార్యకర్తలకు జగన్ ఏమి చేశారు? జగన్ మిస్సయిన ప్రధాన అంశం ఇది!
“యుద్ధంలో గెలవాలంటే రాజు మాత్రమే బలవంతుడైతే చాలదు.. సైన్యం కూడా అంతే బలంగా ఉండాలి” 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకూ జగన్ మిస్సయిన అంశం ఇదే! ముఖ్యమంత్రిగా తాను బలంగా పనిచేస్తున్నాను.. ప్రజలకు అన్ని రకాలుగానూ సహాయ సహకారాలు అందిస్తున్నాను.. కరోనా కష్టకాలంలోనూ కమిట్మెంట్ మిస్సవ్వలేదు అని జగన్ భావించి ఉండొచ్చు.
గతంలో ఎన్నడూ లేనన్ని మెడికల్ కాలేజీలు, ఎప్పుడూ నేతలు ఆలోచన చేయని పోర్టులు, సామాన్యుడికి ఆర్థిక భరోసా, ఇంటింటికీ పెన్షన్, గ్రామాల్లోనే మెజారిటీ సమస్యల పరిష్కారానికి గ్రామ సచివాలయాలు.. ఇవన్నీ తన బలాలు అని జగన్ భావించి ఉండొచ్చు.. అది నిజం కూడా.. 40% ఓట్లు ఆ బలం తాలూకు ప్రతిఫలమే! కానీ… గ్రామస్థాయిలో కార్యకర్తకు జగన్ ఆర్థిక భరోసా కల్పించడంలో విఫలమయ్యాడనేది వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ!
గతంలో కమ్యునిస్టులు ఎర్ర జెండా పట్టుకుని సైకిల్ ఎక్కి సెంటర్ కి వెళ్తే… పది మంది వెనుక వచ్చేవారు! ఆ రోజులు ఇప్పుడు లేవు. ఇప్పుడన్నీ కమర్షియల్ పాలిటిక్స్.! 200 రూపాయల పెట్రోల్, 100 రూపాయల బిర్యానీ, 200 రూపాయల క్వార్టర్ బాటిల్ ఖర్చు పెట్టలేనిదీ బయటకు ఒక్కరిని కూడా తీసుకెళ్లలేని పరిస్థితి అనే కామెంట్లు… ద్వితీయ శ్రేణి నేతల నుంచి బలంగా వినిపిస్తుంటాయి.
అయితే… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019కి ముందు ఇదే చేసి ఉంటారు.. మరి 2019 తర్వాత అయినా ఆ కార్యకర్తలకు ఎంతవరకూ న్యాయం చేశారో జగన్ చెప్పాలి. మైకుల ముందు చెప్పలేకపోయినా ఆత్మపరిశీలన చేసుకోవాలి. జగన్ సీఈవో కాదు.. పొలిటీషియన్ అనే విషయం 2019 తర్వాత జగన్ మరిచిపోయాడనే మాటలకు ఈ అనుభవాలే కారణం అని అంటున్నారు సదరు కార్యకర్తలు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… 2029 వరకూ వైసీపీ ప్రతిపక్షంలోనే ఉండాలి. జగన్ బలవంతుడు కాబట్టి నడిచేస్తాడు.. మరి కార్యకర్త ఎలా ముందుకు కదలగలడు.. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా మద్దతు దక్కని కార్యకర్త.. ఈ ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎలా పార్టీ జెండాని గ్రామస్థాయిలో కాపాడగలడు. ఇది జగన్ విస్మరించిన ప్రధాన అంశం.
ప్రస్తుతం గ్రామస్థాయిలో ఏ ఇద్దరు వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు కలిసి మాట్లాడుకుంటున్నా వినిపిస్తున్న మాటలు ఇవే. ఇక సర్పంచుల పరిస్థితి చెప్పే పనే లేదు! టీడీపీ ప్రభుత్వం ఆపిన బిల్లులు కూడా జగన్ వచ్చాక ఇవ్వలేదని అంటున్నారు! ఈ సమయంలో ఇంతకాలం చిన్న చిన్న పనులు చేసుకున్న కార్యకర్తలు జెండా పట్టుకుని ఎలా మనుగడ సాగించగలుగుతారు.?
ఇప్పటికైనా మించిపోయింది లేదు జగన్! ఇప్పటికైనా చేతులు ఊపడం, దండం పెట్టడమే కాదు… కార్యకర్తతో కలిసిపో, ఈ సమయంలో మనోధైర్యాని ఇవ్వు, నిన్ను ఎలా నమ్ముతారో.. ఆ నమ్మకానిని నువ్వు అర్హుడవనే విషయాన్ని ఇంకాస్త బలంగా చెప్పు, కుదిరితే వ్యక్తిగతంగా చెప్పు! తగ్గితే తప్పు లేదు జగన్.. అవసరమైనప్పుడు, మన అనుకున్నవాళ్లకు మన అవసరం ఉన్నప్పుడు! నువ్వే కాదు.. నీ సైన్యం కూడా బలంగా ఉండేలా చూసుకో.. ఆల్ ది బెస్ట్!