రాజీనామాలతో వైసీపీకి కలిగే రాజకీయ లబ్ది ఎంత.?

చక్కగా వున్న సంసారాన్ని నాశనం చేసుకున్నట్లవుతుంది రాజీనామాలతో.! ఈ విషయాన్ని వైసీపీ నేతలెందుకు గుర్తెరగడంలేదు.? మొన్న కరణం ధర్మశ్రీ.. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు.. రాజీనామాలతో ఉత్తరాంధ్రలో హీటు పెంచే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారించబట్టి సరిపోయింది.. లేదంటే, ధర్మాన రాజీనామా చేసేసేవారే.!

అయినా, మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేస్తే ఏమవుతుంది.? విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ విషయమై కీలకమైన ప్రకటన రేపో మాపో వచ్చేస్తుందా.? వెనకబడ్డ ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రం నుంచి ప్రత్యేక సాయం అందుతుందా.? విశాఖ స్టీలు ప్లాంటుని అమ్మేయడానికి సిద్ధమైన కేంద్రం వెనక్కి తగ్గుతుందా.? ఉత్తరాంధ్రకి సంబంధించి.. ఇవి అత్యంత కీలకమైన అంశాలు.

చిత్రంగా, మూడు రాజధానుల కోసం ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేస్తానంటున్నారు. సీనియర్ పొలిటీషియన్ ఆయన. విశాఖకు రాజధాని వల్ల అదనంగా ఒరిగేదేమీ వుండదని ఆయనకు తెలియదని ఎలా అనుకోగలం.? రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రగిల్చేందుకు కరణం ధర్మశ్రీ, ధర్మాన ప్రసాదరావు రంగంలోకి దిగారు.

నిజానికి, వీళ్ళసలు రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు. టీడీపీ నుంచి వైసీపీలోకి దూకిన ఎమ్మెల్యేలతో గనుక వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజీనామా చేయించగలిగితే, తద్వారా వచ్చే ఉఫ ఎన్నికల్లో ఎలాగూ గెలుస్తారు గనుక.. అదే మూడు రాజధానులకు రెఫరెండం అని వైఎస్ జగన్ నిరూపించెయ్యొచ్చు కదా.?

కరణం ధర్మశ్రీ, ధర్మాన ప్రసాదరావు రాజీనామాలతో ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల మీదనే కాదు.. రాయలసీమకి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపైనా రాజీనామా ఒత్తిడి పెరుగుతోంది. ఇది అంతిమంగా, ముందస్తు ఎన్నికలకు కారణమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.