2024 ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈసారి ఎన్నికలు టీడీపీకి చావో రేవో లాంటివన్నది నిర్వివాదాంశం. ఇంకోసారి ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక చంద్రబాబుకి లేదు. ఓడితే గనుక రాజకీయ సన్యాసమే తప్పప, ఇంకో మార్గం లేదన్నది బహిరంగ రహస్యం.
అందుకే, ఇంకోసారి ముఖ్యమంత్రి.. అనిపించేసుకోవాలని చంద్రబాబు తహతహలాడుతున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు కలిసినప్పుడు, ‘పాత స్నేహాన్ని’ బాగానే గుర్తు చేశారట చంద్రబాబు.. నరేంద్ర మోడీకి. చంద్రబాబు చేసిన ద్రోహాన్ని నరేంద్ర మోడీ మర్చిపోతారా.? అన్నది వేరే చర్చ.
రాజకీయాల్లో శాశ్వత శతృవులు ఎవరూ వుండరు. అది చంద్రబాబుకి బాగా తెలుసు కూడా. బీజేపీ కూడా డక్కామక్కీలు తినేసింది రాజకీయాల్లో. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని కలుపుకుపోతే ఎంత లాభం.? అన్న దిశగా బీజేపీ లెక్కలు వేసుకుంటుంది ఖచ్చితంగా.
టీడీపీతో కలిసి పోటీ చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే.. ఆ ప్రభుత్వానికి చంద్రబాబు నేతృత్వం వహించినా, రెండు మూడేళ్ళలో.. చంద్రబాబుని ఇంటికి పంపించెయ్యడమెలాగూ తమకు తెలుసు గనుక.. అన్న కోణంలో బీజేపీ ఆలోచనలు సాగుతున్నాయట.
ఈ విషయం చంద్రబాబుకీ తెలుసు. కానీ, ఎలాగోలా అధికారంలోకి వస్తే చాలనుకుంటున్నారు చంద్రబాబు. అయితే, టీడీపీ – బీజేపీ కలవడం వల్ల నిజంగా ప్రయోజనం వుంటుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక్కడ. ఇంతకీ, ఈ సందట్లో జనసేన ప్రస్తావన ఏదీ.? అంటే, టీడీపీ – బీజేపీకి సంబంధించి కొందరు ‘ముఖ్య నేతల మధ్య’ తెరవెనుక జరుగుతున్న చర్చల్లో జనసేన గురించి అస్సలెవరూ మాట్లాడుకోవడంలేదట.