కుప్పంలో చంద్రబాబు గెలవకపోతే.? ఏం జరుగుతుందబ్బా.!

కుప్పంలో మళ్ళీ చంద్రబాబు గెలిస్తే ఏమవుతుంది.? ఇంకేమవుతుంది.. అయితే అధికార పీఠమెక్కుతారు.. లేదంటే, ప్రతిపక్ష నేతగా వుంటారు. ఇవేవీ కాదు, టీడీపీకి మరీ తక్కువ సంఖ్యలో సీట్లు వస్తే, జనసేన పార్టీకి కాస్త ఎక్కువ సీట్లు వస్తే, చంద్రబాబుకి ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కదు.

చంద్రబాబుని ఎలాగైనా కుప్పంలో ఓడించాలన్నది వైసీపీ ఉద్దేశ్యం. ఆ దిశగా నానా రకాల వ్యూహాలూ రచిస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే కుప్పంలో కనీ వినీ ఎరుగని స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కుప్పంలో వైసీపీ గెలిస్తే, గెలిచే అభ్యర్థి (భరత్) మంత్రి అవుతారన్నది వైఎస్ జగన్ ఉవాచ.

కుప్పంలో వైసీపీ గెలిచి, రాష్ట్రంలో మెజార్టీ దక్కించుకోలేకపోతే, కుప్పం ఎమ్మెల్యే మంత్రి అయ్యే అవకాశం వుండదు కదా. ఒకవేళ చంద్రబాబు ఓడి, టీడీపీ గెలిచినా.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు.. శాసన మండలి ద్వారానో.. లేదంటే, ఉప ఎన్నికకు వెళ్ళడం ద్వారానో.!

రాజకీయాల్లో నాయకులు లేదా పార్టీల గెలుపు అనేది ప్రజల కోసం అయి వుండాలి. వ్యక్తుల గెలుపోటముల కోసమే రాజకీయాలంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. 151 సీట్లు గెలిచిన వైసీపీ ప్రత్యేక హోదా తీసుకురాగలిగిందా.? రేప్పొద్దున్న 175 సీట్లు గెలిచినా ప్రత్యేక హోదా తెస్తుందా.?

రాజధానికి దిక్కులేదు వైసీపీ పాలనలో. ఏం మొహం పెట్టకుని వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓట్లు అడుగుతుంది.? అన్న ప్రశ్న తెరపైకి వస్తుంది. వైసీపీ ఇంకోసారి అధికారంలోకి రావాలంటే, ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పగలగాలి. లేదూ, ఇదే రాజకీయం కొనసాగిస్తామనుకుంటే, వైసీపీ.. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఆశలు వదిలేసుకోవాల్సిందే