మరో ఆరు నెలల్లో ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. రాజకీయ నేతలు జోరుగా ప్రచార కార్యక్రమాలు కానిచ్చేస్తున్నారు. సర్వేలు చేయించి మరీ గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ప్రకటిస్తున్నారు. అభ్యర్థుల గెలుపోటములు బేరీజు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో విశాఖ జిల్లాలోని గాజువాక నియోజకవర్గం రాజకీయాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసిపి గెలుస్తుందా? టిడిపి ఓడిస్తుందా అనే డిబేట్ మొదలైంది. ఈ గాజువాక రాజకీయాలపై మనం కూడా ఒకే లుక్కేద్దాం.
విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో కుల రాజకీయాలదే హవా అని ఎప్పటి నుండో ఉన్న ప్రచారం. కంటెస్ట్ చేసేది ఎవరైనా సరే తమ కులపోడు అయితే చాలు కళ్ళు మూసుకుని ఓటేస్తారు ఓటర్లు అంటారు రాజకీయ విశ్లేషకులు. గాజువాకకు ధనిక నియోజక వర్గం అనే ట్యాగ్ ఉంది. ఇక్కడ కాపు, యాదవ, ఎస్సి, గవర, రెడిక, మత్స్యకారుల కమ్యూనిటీలు ఉన్నాయి. కాగా ఈ సామాజికవర్గాలలో గెలుపు ఓటములపై ప్రభావం చూపేది మాత్రం కాపు, యాదవ వర్గాలే. గంగవరం పోర్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ సెజ్, బీహెచ్ పివిలతోపాటు, పారిశ్రామిక ప్రగతి కేంద్రంగా నిలిచింది గాజువాక. దీంతో ఇక్కడికి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారే అధికంగా ఉంటారు.
2009 లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఈ నియోజకవర్గంలో చింతలపూడి వెంకటరామయ్య ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత కొంతకాలానికి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం ఐంది. విభజన ప్రభావం వలన రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి గడ్డుగా మారింది. ఈ కారణం వలన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చింతలపూడి వెంకట్రామయ్య 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. వైసిపి, టిడిపి లు మాత్రమే గాజువాకలో ఎన్నికల బరిలోకి దిగాయి.
టిడిపి తరపున పల్లా శ్రీనివాస్ పోటీ చేయగా వైసిపి నుండి తిప్పల నాగిరెడ్డి బరిలోకి దిగారు. ఇద్దరి మధ్యన గట్టి వార్ నడిచినప్పటికీ టిడిపి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ విజయం సాధించారు. దీనికి కారణం టిడిపి కి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడమే అంటారు. పవన్ కళ్యాణ్ తో మైత్రి కారణంగా కాపు, యాదవ, మత్స్యకార ఓటర్ల కాంబినేషన్ టిడిపి కి కలిసొచ్చి ఆ ఎన్నికల్లో టిడిపి గెలిచింది అంటారు. అయితే ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్లా నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాకా అవి సముద్రంలో కలిసిపోయాయి అంటున్నారు. అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని టాక్.
మొదటిసారి 2014 లో ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా తొలినాళ్లలో కుటుంబ ఒత్తిడులు, ద్వితీయశ్రేణి నాయకత్వం వంటి సమస్యలు చవి చూశారు. దీంతో అక్కడ పరిస్థితి తారుమారయ్యింది. ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నట్టు తెలుస్తోంది. ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ కన్వీనర్ నాగిరెడ్డి రెండుసార్లు ఓడిపోవడంతో ప్రజల్లో కొంత సానుభూతి కూడగట్టుకుంది. పల్లా తో అసంతృప్తిగా ఉన్న జనం నాగిరెడ్డికి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి వైసీపీలో చేరడం అక్కడ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చింది.
విశాఖలో జగన్ పాదయాత్రకు కూడా మంచి స్పందన రావడం అదనపు అడ్వాంటేజ్. దీంతో వైసిపి శ్రేణులు గాజువాకలో గెలుపు మనదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో పరాజయం పాలవడంతో జగన్ ఈ నియోజకవర్గంపై మరింత దృష్టి సారించారట. నేతలకు ప్రజలకు అత్యంత చేరువగా ఉండాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ… వైసిపి అధికారంలోకి వస్తే తీసుకురానున్న నవరత్నాల పథకం గురించి విస్తృత ప్రచారం చేయాల్సిందిగా గాజువాక నేతలకు సూచించినట్టు సమాచారం. ఈసారి ఎన్నికల్లో జనసేన రంగంలోకి దిగనుంది. గాజువాకలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ వర్గం వారిని ఆకర్షించే దిశగా ప్రచారం చేయాలి అంటూ జగన్ నేతలకు దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.