టీడీపీకి గుడ్డి మద్దతు.! దేనికి సంకేతం జనసేనానీ.!

ప్రతి విషయంలోనూ తెలుగుదేశం పార్టీకి గుడ్డిగా మద్దతిచ్చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింసని ఎవరూ ప్రోత్సహించకూడదు. ఏ రాజకీయ పార్టీ అయినాగానీ, హింస అలాగే రక్తపాతాన్ని ఖండించాలి.! పైగా, పోలీసుల మీద దాడుల్ని ఎవరూ సమర్థించకూడదు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు టూర్, రక్తాన్ని చిందించింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలే కాదు, పోలీసులు కూడా రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. ఈ దురదృష్టకర ఘటన ఎలా జరిగింది.? అంటే, రెచ్చగొట్టే చర్యల కారణంగా.

వైసీపీ అసలు ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసి వుండాల్సింది కాదు. టీడీపీ అసలు రెచ్చగొట్టి వుండాల్సింది కాదు.! పోలీసులు అంత తేలిగ్గా ఈ కార్యక్రమం గురించి వ్యవహరించి వుండాల్సింది కాదు.! తప్పు ముగ్గురిదీ వుంది.!

అసలు పోలీసుల బాధ్యతే, శాంతి భద్రతల్ని పరిరక్షించడం. అంటే, రాజకీయ పార్టీల సభలకు అనుమతులు ఇవ్వకపోవడం కాదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ వుంటుంది.. జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, వైసీపీ కోసమే పోలీస్ వ్యవస్థ పని చేస్తున్నట్లుంది.. అన్నట్టు తయారైంది పరిస్థితి. అదే అన్ని సమస్యలకీ కారణం.

సుదీర్ఘ రాజకీయ అనుభవం వుందని చెప్పుకునే చంద్రబాబూ రెచ్చగొట్టే చర్యలకు దిగారు. విపక్షాల కార్యక్రమాలకు అడ్డు తగలకూడదన్న ఇంగితం వైసీపీలో లేకుండా పోయింది. ఇన్ని వైఫల్యాల నడుమ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రంగా, టీడీపీకి మద్దతు ప్రకటించేశారు.. పరోక్షంగా.

టీడీపీ మీద జరిగిన దాడుల్ని ఖండించేశారు జనసేనాని. వైసీపీ మీద జరిగిన దాడినీ, పోలీసుల మీద జరిగిన దాడిని కూడా జనసేనాని ఖండించి వుండాల్సింది. రేప్పొద్దున్న జనసేనకు సంబంధించిన ఏదన్నా సమస్య వస్తే, వెంటనే చంద్రబాబు స్పందించేస్తారు. ఇదీ ఏపీలో టీడీపీ – జనసేన కలిసి ఆడుతున్న రాజకీయ నాటకం.!