తెలంగాణలో కొత్తగా పార్టీ పెడుతున్నానంటూ హడావుడి చేస్తున్నారు వైఎస్ షర్మిల. రాజన్న బిడ్డగా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని అంటున్నారామె. షర్మిల అన్నయ్య వైఎస్ జగన్ ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా ఉండగా, ఒకప్పుడు కీలకంగా పనిచేసిన వైసీపీ పాలక పార్టీగా ఉండగా వాటిని వదిలేసి తెలంగాణలో పార్టీ పెడతాను అంటుండటం మీద అనేకరకాల అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. వాటిని కాసేపు పక్కనబెడితే షర్మిలగారు చెబుతున్న రాజన్న రాజ్యం అనే కాన్సెప్టే అర్థంకావట్లేదు జనానికి. అసలు రాజన్న రాజ్యం అంటే ఏంటో సరైన అర్థం చెప్పకుండా రాజన్న రాజ్యం.. రాజన్న రాజ్యం అంటుంటే దానికేమన్నా ట్రేడ్ మార్క్ ఉందా, అదేమన్నా చట్టబద్దమైన వ్యవహారమా అనుకోవాల్సి వస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఏమో కేసీఆర్ ప్రోత్సాహంతోనే జగన్ షర్మిల చేత పార్టీ పెట్టించి తమ ఓటు బ్యాంకును చీల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తెరాస ఏమో ఇంకా స్పష్టమైన అభిప్రాయం ఏదీ చెప్పలేదు. బీజేపీ కూడ తమను ఒంటరిగా ఎదుర్కోలేక కేసీఆర్ వేసిన పన్నాగం ఇదని అంటున్నారు. వాటిని కూడ పక్కనపెడితే శాంతిలాగారి దృష్టి కోణం నుండి ఆలోచిస్తే రాజన్న రాజ్యం అంటే సంక్షేమ పథకాల రాజ్యం అనుకోవాలేమో. ప్రస్తుతం ఏపీలో ఈ సంక్షేమ పథకాల పండుగే నడుస్తోంది. అభివృద్ధి పడకేసినా కూడ పలు రకాల పథకాలతో భారీ ఎత్తున నగదు బదిలీ జరిగిపోతోంది. అప్పులు తెచ్చి మరీ పనిచేస్తున్నారు. మరి అలాంటి రాజ్యమే తెస్తానని షర్మిలగారు చెబుతున్నారేమో.
అలా అనుకున్నా కూడ తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్సిమెంట్, 108, 104 సేవలు నిరాటకంగా నడుస్తున్నాయి. కేసీఆర్ వాటిని తొలగించలేదు. అప్పుడు రాజన్న రాజ్యం ఉన్నట్టే కదా. మరి షర్మిలగారు కొత్తగా తెచ్చేదేంటో గెస్ చేయలేకున్నారు జనం. కొందరైతే రాజన్న రాజ్యం అంటూ ఆంధ్రాలో వైఎస్ఆర్ కుమారుడు జగన్ పాలన చేస్తున్నారు, ఇప్పుడు వైఎస్ఆర్ కుమార్తె షర్మిల కూడ రాజన్న రాజ్యం పేరు చెప్పి తెలంగాణను పాలించాలని అనుకుంటున్నారేమో అంటున్నారు. నిజానికి రాజన్న రాజ్యం అని జగన్, షర్మిల అంటున్నారు కానీ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ఎక్కడా నా రాజ్యం.. రాజన్న రాజ్యం అనలేదు. ఎప్పుడూ ఇందిరమ్మ రాజ్యమనే అనేవారు. ఎన్నో మంచి పథకాలను పెట్టిన ఆయన వాటిలో ఒక్కదానికి కూడ తన పేరు పెట్టుకోలేదు. మరి వైఎస్ఆర్ పాలన అంటే అది.