చిత్తూరు రాజకీయాలు అంటే గుర్తొచ్చే బలమైన కుటుంబాలలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ, నూతనకాల్వ ఫ్యామిలీలు ఉంటాయి. 1985 నుండి 2004 వరకు పీలేరు నియోజక వర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రత్యర్థుల్ని మూడు సార్లు ఓడించి విజయం సాధించారు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఎదిగారు.
2009 లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఆయన స్వగ్రామం పుంగనూరు నియోజకవర్గంలోకి వచ్చింది. దీంతో 2009 లో పుంగనూరు నుండి పోటీ చేసి విజయం సాధించారు రామచంద్రారెడ్డి. 2014 ఎన్నికల్లో వైసిపి తరపున బరిలోకి దిగిన ఆయన ప్రత్యర్థిని ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే అదే సంవత్సరం తన అనుచరుడిని పీలేరు నియోజకవర్గం నుండి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిపై పోటీ చేయించి, గెలుపొంది అక్కడ కూడా తన బలాన్ని చాటుకున్నారు.
మరి అంతటి దృఢమైన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన చేతుల్లో టిడిపి 5 సార్లు ఓటమి పాలయ్యింది. అటువంటి నాయకుడు ఉన్నచోట చంద్రబాబు నాయుడు అనిషా రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం సాహసమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటు టిడిపి వర్గాల్లో కూడా అదే వాదన వినబడుతోంది.
కొద్దిరోజుల క్రితం చిత్తూరులో పర్యటించిన చంద్రబాబు నాయుడు పుంగనూరు నియోజకవర్గ ఇంఛార్జిగా అమర్నాధ్ రెడ్డి మరదలు అనిషా రెడ్డిని ప్రకటించారు. చంద్రబాబు ప్రకటించిన తొలి అభ్యర్థి అనిషా కావడంతో బాబు దగ్గర మంచి మార్కులు పడ్డాయని, స్టామినా ఉన్న లీడర్ కాబట్టే ఆయన ప్రకటించారని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. కానీ అవతల బలమైన ప్రత్యర్థి ఉన్న తరుణంలో బయటకి వెళ్లగక్కకపోయిన టిడిపి శ్రేణులు లోలోపల మదన పడుతున్నట్టు తెలుస్తోంది.
అయితే అనిషా రెడ్డిని ఎంపిక చేయడం వెనుక బాబుకి కొన్ని లెక్కలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ముందు 1985 నుండి 1994 వరకు అనిషా రెడ్డి మామగారు నూతనకాల్వ రామకృష్ణారెడ్డి 3 సార్లు పుంగనూరు నియోజకవర్గం నుండి టిడిపి తరపున గెలిచారు. తర్వాత ఆయన కుమారుడు ప్రస్తుతం మినిష్టర్ గా ఉన్న అమర నాధ్ రెడ్డి 1996 ఉపఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. 2004 లో కూడా అమర్నాథ్ రెడ్డి పుంగనూరు టిడిపి నుండే పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసిపి నుండి పలమనేరు నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందిన ఆయన ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రిగా కొనసాగుతున్నారు.
పుంగనూరు నుండి గత రెండు ఎన్నికల్లోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. ఈసారి ఆయన్ని ఓడించాలంటే అక్కడ అదే స్థాయిలో ఉన్న బలమైన నేత కావాలి. ఈ నేపథ్యంలో నూతనకాల్వ కుటుంబానికి పుంగనూరులో మంచి స్థానం ఉంది. 5 సార్లు ఇదే స్థానం నుండి పోటీ చేసిన నూతనకాల్వ కుటుంబీకులకు విజయం అందించారు ప్రజలు. ఇది దృష్టిలో పెట్టుకునే పెద్దిరెడ్డిని ఓడించడానికి అదే కుటుంబానికి చెందిన నూతనకాల్వ అమర్నాధ్ రెడ్డి మరదలు అనీషారెడ్డిని బాబు రంగంలోకి దింపారు అనుకుంటున్నారు.
ఈసారి ఎలాగైనా పెద్దిరెడ్డిని ఓడించాలని సంకల్పంతో నూతనకాల్వ కుటుంబానికి ఉన్న ఇమేజ్ తో పాటు, మహిళా ఓటర్లను ఆకర్షించే దిశగా అనిషా రెడ్డిని చంద్రబాబు నిలబెట్టారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుంగనూరులో ఈసారి రెండు బలమైన కుటుంబాల మధ్య పోటీ జరగనుందని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. గెలుపు ఎవరిది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాజకీయ అభిమానులు.
ఇదిలా ఉండగా… అనీషారెడ్డి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారట. ప్రజల్లో మమేకమవుతూ ఇప్పటి నుండే ప్రచార కార్యక్రమాలు మొదలెట్టేసినట్టు తెలుస్తోంది. మంగళవారం స్థానిక బస్టాండ్ లో జరిగిన సమావేశంలో అనీషారెడ్డి మాట్లాడారు. సమిష్టి కృషితో పుంగనూరులో గెలిచి చూపిద్దామని కార్యకర్తలకు సూచించారు. రానున్న ఎన్నికల్లో పుంగనూరులో టిడిపిని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కానుకగా ఇద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.