రాజకీయ భవిష్యత్తుపై వంగవీటి రాధా అనూహ్య వ్యాఖ్య

వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వంగవీటి రాధా అధిష్టానంపై అలక పూనారు. సెంట్రల్ సీటుపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఆ సీటును మల్లాది విష్ణుకి కేటాయించడంతో సీటుకై పార్టీలో పోరు మొదలైంది. వంగవీటి రాధను విజయవాడ తూర్పు నుండి లేదా మచిలీపట్టణం ఎంపీ స్థానంలో పోటీ చేయాల్సిందిగా అధిష్టానం సూచించింది. కానీ రాధా మాత్రం సెంట్రల్ సీటు కోసమే పట్టు బట్టారు.

అయితే జగన్ మాత్రం ఆ సీటు మల్లాది విష్ణుకే అని తేల్చి చెప్పడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాధా స్థానం ఏమిటన్న అంశం చిక్కుముడి వీడని ప్రశ్నగా మిగిలింది. అయితే తన తండ్రి వంగవీటి మోహన్ రంగా వర్ధంతి రోజు తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? వైసీపీలో తన స్థానం ఏమిటి? రాధా రాజకీయ భవిష్యత్తు ఏమిటి? వివరాలు తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ చదవండి.

ఈ నెల 26 న వంగవీటి మోహన్ రంగా 30 వ వర్ధంతిని పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు వంగవీటి రాధా హాజరయ్యారు. కానీ ఈ కార్యక్రమాల్లో ఎక్కడ వైసీపీ పార్టీ జెండాలు కనిపించలేదు. పార్టీ నాయకులూ కూడా రాధతో కలిసి వేదిక పంచుకోలేదు. అయితే రంగా స్వగ్రామం ఉయ్యూరు మండలం కాటూరులో రాధారంగా స్మరణ భూమి శంకుస్థాపన కార్యక్రమంలో వంగవీటి రాధా, ఆయన తల్లితోపాటు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ నేత యలమంచిలి రవి పాల్గొన్నారు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జ్ మల్లాది విష్ణు, వైసీపీ నేత వెలంపల్లి శ్రీనివాసరావులు వన్ టౌన్ లో కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన రంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడలో ఒకచోట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాధా మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తుపై అనూహ్య వ్యాఖ్య చేసారు. తన ఫైనల్ డెసిషన్ ఈ సందర్భంగా రాధా బయటపెడతాడు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. కానీ అందుకు అనూహ్యంగా రాధా మాత్రం తన రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది అంటూ నర్మగర్భంగా  వ్యాఖ్యానించారు.

కాగా రాధా  రాధాకు, వైసీపీకి ఉన్న దూరాన్ని ఆయన చేసిన వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి ఆయన అనుచరులే అంటున్నారు.  అంతేకాదు త్వరలోనే ఆయన పార్టీ మారడంపై ఒక  ప్రకటన చేస్తారని చెబుతున్నారు.  రంగా సంస్మరణ సభలకు వైసీపీ నేతలు హాజరు కాకపోవడం, ఎక్కడా వైసీపీ జెండాలు కనిపించకపోవడం, ఆయన అనుచరులు కూడా పార్టీ మారతారని అనడం చూస్తుంటే రాధా ఇక వైసీపీ వీడతారా అనే అనుమానం రాకమానదు.  అంతేకాదు రాధని సెంట్రల్ సీటు నుండి తప్పిస్తూ విజయవాడ తూర్పు నుండి కానీ మచిలీపట్టణం ఎంపీ స్థానం నుండి పోటీ చేయాల్సిందిగా వైసీపీ అధిష్టానం సూచించింది. ఆయన అందుకు అంగీకరించలేదు.

ఈ విషయంపై చర్చలు నడుస్తున్న సమయంలోనే మచిలీపట్టణం ఎంపీ నియోజకవర్గం సమన్వయకర్తగా బాలశౌరిని ప్రకటించింది వైసీపీ అధిష్టానం. బాలశౌరి కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగిపోయింది. నియోజకవర్గంలో బలాన్ని చేకూర్చుకునే పనిలో కూడా పడిపోయారు బాలశౌరి. ఇక విజయవాడ తూర్పులో యలమంచిలి రవి విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో మునిగిపోయారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని వైసీపీ అధిష్టానం పొమ్మనకుండా పొగబెడుతున్నదా  అనే భావనలో ఉన్నారట రాధా, ఆయన అభిమానులు.

మరోవైపు అనుచరులు కూడా పార్టీ మారాలంటూ టీడీపీ లేదా జనసేనలో చేరాలని ఆయనపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.

అయితే రంగాని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే హత్య చేయించారు అనే ఆరోపణలు ఉన్నాయి. మరి టీడీపీలో చేరితే  రంగా అభిమానుల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటందని  అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి తన సామాజిక వర్గానికి చెందిన పార్టీ ఐన జనసేనలో చేరతారా అంటే ఒకే సామాజికవర్గం కదా అని 2009 లో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసి సెంట్రల్ లోనే ఓటమి పాలయ్యారు. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? లేదా గతం గతః అనుకుని టీడీపీ లేదా జనసేనలో చేరతారా అనేది తేలాల్సి ఉంది.