కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కాలన్న డిమాండ్‌ని తప్పు పట్టడానికేమీ లేదు. నిజానికి, అధికార పీఠమెక్కే అర్హత అన్ని సామాజిక వర్గాలకీ వుంది.. అన్ని మతాలకీ వుంది.
కానీ, రాజకీయాల్ని కొన్ని కులాలు శాసించడం అనేది కొత్తేమీ కాదు. కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన ఓట్ల రాజకీయం నడుస్తోంది చాలాకాలంగా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఈసారి రాజ్యాధికారం కోరుకుంటోంది.. కాస్త బలంగా.! అయితే, ఇదే మొదటి సారి అనుకోవడానికి వీల్లేదు. గతంలో కూడా కాపునాడు సందర్భంగా రాజ్యాధికారం దిశగా తీర్మానాలు జరిగాయి. కానీ, అవేమీ పనిచేయలేదు.
‘కాపు సామాజిక వర్గంలో ఐక్యత లేదు’ అని కాపు సామాజిక వర్గ ప్రముఖులే చెబుతున్నారు. ‘మాలో ఒకడు ఎదుగుతోంటే, మాలోనివాడే ఎదుగుతున్నవాడ్ని కిందికి లాగేస్తాడు..’ అని చాలా న్యూస్ డిబేట్స్‌లో కాపు సామాజిక వర్గ ప్రముఖులు చెప్పడం చూశాం.
తాజాగా విశాఖలో కాపు నాడు జరిగితే, అది కాస్తా జనసేన కాపునాడుగా మారిపోయింది. ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ ఈ కాపునాడుకు దూరంగా వున్నాయి. ఆ రెండు పార్టీలూ దివంగత వంగవీటి మోహన రంగా చుట్టూ రాజకీయాలు చేయడంలో బిజీగా వున్నాయి.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఈసారి కాపునాడు నినాదం రాజ్యాధికారం.. అది కూడా జనసేనకు అధికారం అనే. అయితే, కాపు సామాజిక వర్గంలోనే చాలామంది పవన్ కళ్యాణ్ రాజకీయ సిద్ధాంతాలపై అనుమానాలతో వున్నారు. అదే అసలు సమస్య.