ఆలస్యంగా కూసి దొరికిపోయిన జీవీఎల్!

రాజకీయాల్లో టైం ఎంత ముఖ్యమో.. టైమింగ్ కూడా అంతే ముఖ్యం. టైం బాగోక పోయినా.. టైమింగ్ మిస్సయ్యినా.. తల బొప్పికట్టడం అన్నది రాజకీయాల్లో సర్వసాధారణమైన విషయం. ముందుగా కూస్తే కమేడియన్ అయిపోతారు.. ఆలస్యంగా కూస్తే కార్టూన్ అయిపోతారు! ఈ విషయంలో కార్టూన్ అయిపోవడానికి పోటీపడిపోతున్నారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు అనే కామెంట్లు ఫ్రెష్ గా స్టార్ట్ అయిపోయాయి!

వివరాల్లోకి వెళ్తే… ఏపీలో ఒక జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని తాజాగా డిమాండ్ చేశారు జీవీఎల్. తాజాగా రాజ్యసభలో ఈ డిమాండ్ చేశారు జీవీఎల్. సరే.. జీరో అవరు, పైగా ఇంక మాట్లాడటానికి జీవీఎల్ దగ్గర మరో సబ్జెక్ట్ లేక ఇలా మాట్లాడారేమో అనుకుంటే పొరపాటు పడినట్లే సుమా! ఎందుకంటే… సడన్ గా జీవీఎల్ కు రంగా పైనా, ఏపీలోని కాపుల మనోబావాలపైనా ఇంత ప్రేమ రావడానికి కారణం మరొకటుంది!

ఏపీలో పదమూడు జిల్లాలు కాస్తా ఇరవై ఆరు జిల్లాలుగా మారి ఏడాది కావస్తోన్న సంగతి తెలిసిందే! కొత్త జిల్లాల మీద రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నపుడు సైలంట్ గా ఉన్నారు.. పేర్లు ప్రతిపాదిస్తున్నపుడు బీజేపీకి డిమాండ్ చేసే అవకాశం ఉండి కూడా మౌనంగానే ఉన్నారు.. బీజేపీకి ఎమ్మెల్సీలు ఉన్న శాసనమండలిలోనూ మౌనంగానే ఉన్నారు… అప్పడు లేవని డిమాండ్ ఇప్పుడు లేస్తుంది ఏ…? అంటే… రాబోయే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తున్నారు జీవీఎల్!

నిజంగా పైన చెప్పుకున్న ఏ సందర్భంలో అయినా జీవీఎల్ ఈ డిమాండ్ చేసి ఉంటే.. కచ్చితంగా ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభించి ఉండేదనే పలువురి అభిప్రాయం. దీంతో… “జీవీఎల్ వి కేవలం రాజకీయ ఉద్దేశ్యాలు తప్ప, కాపులపై కు ప్రత్యేకంగా ప్రేమా లేదు.. రంగా పై స్పెషల్ గౌరవమూ లేదు” అనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా గిరా గిరా తిరుగుతున్నాయి! అందుకే అంటారు… రాజకీయాల్లో టైం అండ్ ‘టైమింగ్’ కీలకం అని!