కెసియార్ కు చంద్రబాబుకు తేడా తెలుసా ?

అవును ఇపుడిదే అంశంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.  టికెట్ల కేటాయింపులో  ఇద్దరు అధినేతల మధ్య తేడా స్పష్టంగా అర్ధమైపోతోంది. తెలంగాణాలో కెసియార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో టికెట్ల కేటాయింపులో కెసియార్ అనుసరించిన విధానం గుర్తుందా ? మొదటి జాబితాలోనే మొత్తం 118 సీట్లకు గాను 105 మందికి టికెట్లు కేటాయించేశారు. ఏదో అక్కడక్కడ గొడవలు జరిగినా  కెసియార్ వెనక్కు తగ్గలేదు.  ఆరోపణలు ఉన్న వారికి కూడా మళ్ళీ టికెట్లు కేటాయించేశారు.

సీన్ కట్ చేస్తే ఇపుడు చంద్రబాబునాయుడు చేస్తున్నదేంటో అందరూ చూస్తున్నదే. దాదాపు ఏడాదిన్నరగా సర్వేలు చేయిస్తున్నారు. తీరా ఎన్నికల షెడ్యూల్ రిలీజైన తర్వాత కూడా పదిమంది అభ్యర్ధులను కూడా అధికారికంగా ప్రకటించలేకున్నారు. గొడవలు జరగని నియోజకవర్గాలు దాదాపు లేవనే చెప్పాలి. నియోజకవర్గాల్లో నేతలు గొడవలు చేయగానే ఎంఎల్ఏలనే కాదు చివరకు మంత్రులను సైతం మార్చేస్తున్నారు. అంతెందుకు స్పీకర్ కోడెల శివప్రసాద్ కు కూడా షాక్ తప్పేట్లు లేదు.

చంద్రబాబు అనుసరించిన విధానాలే చివరకు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి. ఏ నేతను అదుపు చేయలేకపోతున్నారు. కనీసం ఆరుగురు మంత్రుల టికెట్లే డౌట్ అంటున్నారు. తక్కువలో తక్కువ 20 లోక్ సభ నియోజకవర్గాల్లో అభ్యర్ధులు లేరంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఎంపిగా ఎవరిని పోటీ చేయమని అడుగుతున్నా వద్దనేస్తున్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏకో లేకపోతే మంత్రికో టికెట్ ఇస్తే ఓడగొడతామని నేతలు అల్టిమేటమ్ ఇవ్వగానే వాళ్ళకి టికెట్లు పెండింగ్ లో పెట్టేస్తున్నారు. అంటే పార్టీ మీద పట్టులేదని అర్ధమైపోతోంది.

ముందస్తు ఎన్నికలకు వెళ్ళినపుడు కెసియార్ లో ఆత్మవిశ్వాసం కనబడింది. ఇపుడు చంద్రబాబులో అదే లోపించింది. అందుకనే ఏ ఒక్క నేతను కూడా అదుపు చేయలేకపోతున్నారు. పార్టీలో నేతలను కన్వీన్స్ చేయలేకపోతున్న చంద్రబాబు రేపటి ఎన్నికల్లో జనాలను ఎలా కన్వీన్స్ చేయగలరు ? జనాలు కూడా ఎందుకు ఓట్లు వేస్తారు ?