ప్రభుత్వంపైనే కాదు, పోలీసు వ్యవస్థలో అత్యున్నత స్థానంలో వున్న అధికారులపైనా సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణలతో వివాదం ముదిరి పాకాన పడింది. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు చేపట్టిన ఏబీ వెంకటేశ్వరరావుపై అప్పట్లోనే వైసీపీ తీవ్రమైన ఆరోపణలు చేసింది, అధికారంలోకి వస్తూనే ఆయన్ని సస్పెండ్ చేసింది రకరకాల ఆరోపణలు ఆయన మీద చేస్తూ. గత కొద్ది కాలంగా ఆయన ‘సస్పెన్షన్’లోనే వున్నారు. పోస్టింగ్ కోసం ఆయన నానా రకాల ప్రయత్నాలూ న్యాయ వ్యవస్థ సహా అనేక వ్యవస్థల ద్వారా చేస్తూనే వున్నారు. అయినా, జగన్ ప్రభుత్వం పట్టుదల వీడటంలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇచ్చే ప్రసక్తి లేదన్నట్టు వ్యవహరిస్తోంది జగన్ సర్కార్.
తాజాగా పోలీస్ ఉన్నతాధికారి పాలరాజు, ఏబీ వెంకటేశ్వరరావు తీరుపై మీడియా ముందుకొచ్చారు. మరోపక్క, ఆయన మీద మరోమారు చర్యలకు ఉపక్రమిస్తూ నోటీసు జారీ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేయడం సర్వీస్ రూల్స్ వ్యతిరేక చర్య.. అన్నది సీనియర్ ఐపీఎస్ అధికారి పాలరాజు ఆరోపణ. ఈ నేపథ్యంలోనే నోటీసులు జారీ అయ్యాయి. అయితే, తానెక్కడా సర్వీస్ రూల్స్ అతిక్రమించలేదని ఏబీ వెంకటేశ్వరరావు అంటున్నారు. కుట్రపూరితంగా తనను సస్పెండ్ చేశారన్నది ఆయన ఆరోపణ. ఇదిలా వుంటే, పోలీస్ వ్యవస్థలో కొందరు అధికారులు ఏబీ వెంకటేశ్వరరావుకి జరుగుతున్నది అన్యాయమంటూ తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ఏబీ వెంకటేశ్వరరావు మాత్రమే కాకుండా, మరికొందరు అధికారులపైనా జగన్ ప్రభుత్వం కక్షగట్టిందనే ఆరోపణలు టీడీపీ అనుకూల మీడియా ద్వారా వస్తున్నాయి. ప్రభుత్వం మారగానే, అధికారులపై ఆరోపణలంటే, భవిష్యత్ భయానకంగా వుంటుందన్న చర్చ ప్రభుత్వ ఉద్యోగుల్లో జరగడం సహజమే కదా.