కాపు సామాజిక వర్గం వైసీపీకి ఎదురు తిరిగితే.!

జనసేన మీద వైసీపీ విమర్శలు రోజు రోజుకీ శృతి మించుతున్నాయి. కొడాలి నాని తప్పితే, చంద్రబాబు మీద వైసీపీ నేతలు మరీ ‘అబ్యూజివ్ లాంగ్వేజ్’ వాడరు.! టీడీపీ మీద ఘాటైన విమర్శలు వైసీపీ నేతలు చేస్తున్నా, పవన్ కళ్యాణ్ మీద చేసే ‘బ్రోకర్’ స్థాయి విమర్శలైతే ఎక్కువగా వుండవ్.! నిత్యం.. అనునిత్యం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేతలు అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. రాజకీయాల్లో విమర్శలు సహజం.

అవి కాస్తా స్థాయి దాటి, బూతుల వరకూ వెళ్ళడాన్నీ చూస్తున్నాం. చంద్రబాబు మీద వైసీపీ చేసే విమర్శలు కమ్మ వర్సెస్ రెడ్డి.. అనే ఆధిపత్య పోరుకి కారణమవుతున్నాయన్నది నిర్వివాదాంశం. సేమ్ టు సేమ్ వైసీపీ మీద టీడీపీ చేసే విమర్శలూ అంతే.!

అయితే, ఓట్ల పరంగా చూసుకుంటే, కాపు సామాజిక వర్గం ఓట్లు.. కమ్మ అలాగే రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన ఓట్ల కంటే చాలా చాలా ఎక్కువ. కమ్మ సామాజిక వర్గంలో ఇటీవలి కాలంలో జనసేన పట్ల పాజిటివిటీ క్రమక్రమంగా పెరుగుతోందంటే, దానిక్కారణం జనసేనాని మీద వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలే.

వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఈ విషయమై అప్రమత్తమవ్వాల్సిందే. రాజకీయ విమర్శలు వేరు, అభ్యంతరకరమైన పదజాలం వేరు. ‘బ్రోకర్..’ అని పవన్ కళ్యాణ్‌ని విమర్శించే క్రమంలో, చంద్రబాబుని వైసీపీ ‘యజమాని’గా పేర్కొంటోంది. దీన్ని కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ కాపు సామాజిక వర్గం ఈ కారణంగా వైసీపీకి ఎదురు తిరిగితే.?