పవన్ కళ్యాణ్ ‘వారాహి’కి ఏమయ్యింది.?

మొన్నామధ్యన తెలంగాణలోని కొండగట్టులో ‘వారాహి’ వాహనానికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆ తర్వాత విజయవాడ దుర్గ గుడిలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 30 నారసింహ దేవాలయాల్లో ‘వారాహి’ వాహనానికి ప్రత్యేక పూజలు జరుగుతాయని జనసేన పేర్కొంది.

ఇంతకీ, పవన్ కళ్యాణ్ ‘వారాహి’ ఇప్పుడెక్కడుంది.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు ‘వారాహి’ వాహనాన్ని వినియోగించడంలేదు.? అసలు ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించడంలేదు.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. విజయదశమి తర్వాత జనంలోకి.. అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ గురించి జనసేన చాలా గట్టిగా చెప్పింది. ఆయనే ‘వస్తున్నా, విజయదశమి తర్వాత జనంలోకి..’ అంటూ అధికార వైసీపీని హెచ్చరించేశారు కూడా. ఆ తర్వాత సంక్రాంతికి వాయిదా వేశారనుకోండి.. అది వేరే సంగతి. సంక్రాంతి కూడా అయిపోయింది.. ఇంతకీ, జనసేనాని ఎక్కడ.?

‘చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్’ అన్న విమర్శ జనసేనాని మీద వుండనే వుంది. నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర చేస్తున్నారు గనుక, ఆ యువగళం పాదయాత్రపై వున్న ఆ కాస్త హడావిడీ లేకుండా పోతుందనే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంలేదన్నది వైసీపీ వాదన. పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కనిపించకపోయినా, వైసీపీ నేతలు ఏదో ఒకరకంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెస్తూనే వుంటారు. అవన్నీ తర్వాత.. అసలంటూ ‘వారాహి’ ఎక్కడ.? కొండంత రాగం తీసి తుస్సుమనిపించినట్లు.. వారాహిని ఎందుకు మూలన పడేశారో ఏమో.!