అన్నీ జగనే చేస్తే సిఎంగా చంద్రబాబు ఎందుకు ?

ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ కెసియార్ తో జగన్మోహన్ రెడ్డే లేఖ ఇప్పించాలట. ప్రత్యేకహోదాలో ఏపికి రావాల్సిన రాయితీలన్నింటినీ ప్రధానమంత్రి నరేంద్రమోడితో చెప్పి జగన్ రాబట్టాలట. జగనే ఎందుకు చేయాలంటే నరేంద్రమోడి, కెసియార్, జగన్ ఒకటేనట. ఇతంతా ఎవరు చెప్పారని అనుకుంటున్నారా ? ఇంకెవరు చంద్రబాబునాయుడే చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులను జగనే ఇప్పించి, హోదాను జగనే తీసుకువచ్చి, రాయితీలను జగనే తీసుకురావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఏం చేస్తారు ? ఎంచక్కా ప్రత్యేక విమానాలేసుకుని విదేశాల్లో చక్కర్లు కొడతారా ? లేకపోతే ఇతర రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలను కలిసి విందులు చేసుకుంటారా ?

 

చంద్రబాబు వాదనే విచిత్రంగా ఉంది. మీడియాతో మాట్లాడుతూ, ఏపికి కేంద్రం సాయం చేయకపోతే జగన్ తనను ప్రశ్నించటంలో అర్ధం లేదంటున్నారు చంద్రబాబు. పోయిన ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన అజెండా అని చెప్పి కేంద్రంలో మోడిని, రాష్ట్రంలో తనను గెలిపించాలని జనాలను అడిగి ఓట్లేయించుకుంది చంద్రబాబే కదా ? మరి తాను చెప్పినట్లు చంద్రబాబు అభివృద్ధి చేశారా ? చేయలేకపోతే ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి బాధ్యుడెలా అవుతాడు ? నాలుగేళ్ళ పాటు ఎన్డీఏతో అంటకాగింది చంద్రబాబే కదా ? ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు రాష్ట్రాభివృద్ధి జరిగినా, జరగకపోయినా చంద్రబాబే కదా బాధ్యుడు ?

 

ఇక్కడే చంద్రబాబు విచిత్రంగా వాదిస్తున్నారు. కేంద్రం సహకరించకున్న, పెట్టుబడులను అడ్డుకుంటున్నా కష్టపడి తన వ్యక్తిగత క్రెడిబులిటీతో పెట్టుబడులు సాధిస్తు, అభివృద్ధి చేస్తున్నట్లు మళ్ళీ చంద్రబాబే చెబుతున్నారు. అంటే జరిగిన అభివృద్ధి, వచ్చిన పెట్టుబడులేమో తన వల్లే వచ్చాయి. జరగని అభివృద్ధి, రాని పెట్టుబడులకు మాత్రం జగన్ బాధ్యుడు. ఎలా ఉంది చంద్రబాబు లాజిక్ ? పైగా మోడి, కెసియార్, జగన్ ముగ్గురూ ఒకటే కదా అంటూ దెప్పి పొడుపొకటి. నాలుగేళ్ళ పాటు మోడితో సంసారం చేసిందే చంద్రబాబు. కెసియార్ తో ప్రతీ విషయంలోను తగువుపెట్టుకున్నది కూడా చంద్రబాబే. అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే కెసియార్ ప్రభుత్వాన్ని కూలదోయాలని చంద్రబాబు ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు ఆ ప్రయత్నం చేయకపోయుంటే ఇపుడు కెసియార్ తో ఇంత శతృత్వం ఉండేది కాదు కదా ?

 

ప్రతీ విషయంలోను చంద్రబాబు తప్పులు చేస్తు బాధ్యతంతా జగన్ మీదేసేస్తున్నారు. చంద్రబాబు అండ్ కో ఎప్పుడు కూడా గుడ్డ కాల్చి ఎదుటివారి మీదేసయటంలో సిద్ధహస్తులు. తమలోని తప్పులు మాత్రం ఎవరు బయటపెట్టకూడదు, ఎత్తి చూపకూడదు. అదే ఎదుటి వాళ్ళల్లో మాత్రం చిన్న తప్పున్నా బూతద్ధంలో చూపించి నానా యాగీ చేస్తారు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో చంద్రబాబు శృతి పెంచుతున్నది అందుకే. రాష్ట్రాభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నాడనే కొత్త వాదన తెరపైకి తెచ్చి వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందాలన్నదే చంద్రబాబు వ్యూహంగా కనబడుతోంది. మరి జనాలేం చేస్తారో చూడాలి.