వైసీపీ మేనిఫెస్టో ఎలా వుంటుందో మరి.!

వృద్ధాప్య పెన్షన్ 4 వేలకు పెంచేస్తారట.. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఆడబిడ్డకీ నెలకి పదిహేనొందలు ఇచ్చేస్తారట.. బస్సుల్లో జిల్లాల పరిధిలో మహిళలకు ప్రయాణం ఉచితమట.. టీడీపీ పాక్షిక మేనిఫెస్టోలో చాలానే వున్నాయ్.

ఫుల్ మేనిఫెస్టోలో చంద్రబాబు ‘ఆల్ ఫ్రీ’ అని ప్రకటించేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అదే జరిగితే, రాష్ట్రంలో ప్రజలెవరూ ఏ పనీ చేయాల్సిన అవసరమే వుండదు. ఇంట్లో కూర్చుంటే చాలు.. అన్నీ కాళ్ల దగ్గరకు వచ్చేస్తాయ్. ఇక, అభివృద్ధి అంటారా.. అదంతే. సోమరితనం జనంలో పెంచెయ్యడమే ఈ సంక్షేమ పథకాల లక్ష్యం.

వాలంటీర్లతో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తోంది వైసీపీ. అదే ఓ దండగమారి వ్యవస్థ. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అధికారులు చేయాల్సిన పనులు, వాలంటీర్లతో అయిపోతున్నాయ్. ఆ వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలే.

అమ్మ ఒడి అనీ, ఇంకోటనీ.. జనం ఖాతాల్లోకి సొమ్ములు నేరుగా వెళ్ళిపోతున్నాయ్. ఈ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వమే లాక్కుంటుంది.. వివిధ రూపాల్లో. ఎన్ని అప్పులు చేసినాగానీ, ప్రభుత్వ ఖజానా నిండేది ప్రజలు కట్టే పన్నులతోనే కదా.!

ఇంతకీ, వైసీపీ మేనిఫెస్టో ఎలా వుండబోతోంది.? ఖచ్చితంగా టీడీపీ మేనిఫెస్టోకి మించే వుండాలి. వృద్ధాప్య పెన్షన్ 5 వేలు టచ్ చేసెయ్యాల్సిందే.. మహిళలతోపాటు పురుషులకీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని ప్రకటించేయాల్సిందేనేమో.!

సరిపోయింది సంబరం.! ఆడ బిడ్డలకి 2 వేలు లేదా మూడు వేలు.. అని ప్రకటించాలి. నిరుద్యోగులకు నాలుగైదు వేలు ప్రతి నెలా ఇస్తామని చెప్పెయ్యాలి. అంతేనా.? ఇంకేమన్నా వున్నాయా.? చాలా వుంటాయ్, వుండాలి కూడా.!

ఒక్కమాటలో చెప్పాలంటే, ఆల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్.. అలా జరగాలంటే, ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్.. అని బోర్డ్ పెట్టెయ్యాల్సిందే.