నల్లగొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో గెలుస్తుదని.. లేకపోతే తాను గెలిచినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కౌంటర్ కు నల్గొండ టిఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డికి ప్రజలే సన్యాసం ఇస్తారని, ఆయన సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదని భూపాల్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని లేకపోతే ప్రజలే తగిన బుద్ది చెబుతారని భూపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ శనిలా దాపురించిందన్నారు.
నల్లగొండకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసినా నల్లగొండలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, కోమటిరెడ్డి నల్లగొండకు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లగొండకు ఎమ్మెల్యేగా ఉండి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా హైదరాబాద్ లో కాంట్రాక్టు పనులు చేయించుకుంటా ఉన్నాడని విమర్శించారు. ప్రజలల్ల ఉండాల్సిన వాడు కార్పొరేట్ కంపెనీల వెంట కమీషన్ల కోసం తిరుగుతుంటాడని కోమటిరెడ్డిని భూపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు.
నల్లగొండ జిల్లా కేంద్రమైనప్పటికి కూడా కేవలం ఓ చిన్న పట్టణంలా ఉంది తప్పా అభివృద్దిలో వెనుకపడి ఉందన్నారు. కోమటిరెడ్డికి కోతలెక్కువ.. చేతలు తక్కువన్నారు. 2014 లో తాను ఇండిపెండెంట్ గా పోటి చేసినప్పుడే స్వల్ప మెజారిటితో మాత్రమే తాను గెలిచాడని , అక్రమాలు చేసి ఎలా గెలిచాడో ప్రజలంతా గమనించారని అటువంటి మహానుభావునికి మళ్లీ ఓటు వేసి గెలిపిస్తే నల్లగొండ ఎట్ట నాశనం అయితదో ప్రజలు ఆలోచించాలన్నారు.
కోమటిరెడ్డి నల్లగొండ రాజకీయాలలో తనకు తిరుగులేదన్నట్టు విర్రవీగుతున్నాడని, అది తన తాత తరం కాదని హితవు పలికారు. ప్రజా క్షేత్రంలోకి దిగినం… దమ్ముంటే ప్రజలలో తేల్చుకో కానీ కూతలు కూస్తే ఖబడ్దార్ అంటూ కంచర్ల భూపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో నల్లగొండలో 12 కు 12 స్థానాలు గెలుస్తామని భూపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.