కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత. తెలంగాణ ఉద్యమంలో భాగంగా మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీనే నమ్మకుని వున్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్ళేందుకు పలు మార్లు ఈ ఇద్దరు నేతలకు అవకాశం వచ్చినా, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.
ఈ ఇద్దరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే, పీసీసీ అధ్యక్ష పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆ పదవి రేవంత్ రెడ్డికి దక్కింది. దాంతో, ఓటుకు నోటు వ్యవహారంలాగానే పీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కూడా జరిగిందంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసింది. మరోపక్క, రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుపోతున్నారు పీసీసీ అధ్యక్షుడిగా.
కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో వున్న నేతల్ని సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసేందుకు ప్రయత్నించినా, కోమటిరెడ్డి అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కాగా, కోమటిరెడ్డి ఇప్పుడిప్పుడే మెత్తబడుతున్నారు. ఆవేదనతోనే తాను రేవంత్ రెడ్డి విషయంలో అలా మాట్లాడాననీ, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాననీ, పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి తనవంతు ప్రయత్నిస్తాననీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అంతేనా, పార్టీ నాయకత్వం.. ప్రజల్లో వుండాలంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.
ఈ నేపథ్యంలో కోమటిరెడ్డిని రేపో మాపో రేవంత్ రెడ్డి కలిసే అవకాశాలూ లేకపోలేదు. కొసమెరుపేంటంటే, వైఎస్ షర్మిలకు ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ కోమటిరెడ్డి సోషల్ మీడియాలో పేర్కొనడం. కాంగ్రెస్ పార్టీలో ఏమాత్రం పరిస్థితి తేడాగా వున్నా, కోమటిరెడ్డి షర్మిల పార్టీ వైపు చూసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నమాట. ప్రస్తుతం కోమటిరెడ్డి, లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం విదితమే.