వాలంటీర్లు.. వైసీపీ వైపే వున్నారా.? వుంటారా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ తీవ్రాతి తీవ్రమైన విమర్శలు గతంలోనూ చేశారు. అప్పుడెప్పుడూ పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మల్ని వైసీపీ దగ్ధం చేసిన పరిస్థితి లేదు. కానీ, వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని ఆరోపణలు చేశాక, వైసీపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ మీద మండిపడ్డారు. దిష్టిబొమ్మలు తగలబెట్టారు.

పైకి వాలంటీర్ల ఆందోళన.. అంటూ వైసీపీ బిల్డప్ ఇస్తున్నా, తెరవెనుక ఏం జరుగుతోందో అందరికీ తెలుసు. వాలంటీర్ వ్యవస్థను తాము ప్రొటెక్ట్ చేస్తున్నామన్న భావన అయితే వైసీపీ కలగజేయగలిగింది. వైసీపీనే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది.

ఓ సారి వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్నవారిని ఉద్యోగులనీ, ఇంకోసారి.. స్వచ్ఛంద సేవకులు మాత్రమేననీ.. ఇలా వైసీపీ భిన్న వాదనలు వినిపించడం తెలిసిన విషయమే. పైగా, ఐదు వేల రూపాయల గౌరవ వేతనానికి పని చేయడం చాలా చాలా కష్టంగా వుంటోంది వాలంటీర్లకు. అదిప్పుడు, వాలంటీర్లలో ఇంకోసారి అసహనానికి కారణమవుతోంది.

‘నేనైతే ఐదు వేలు కాదు, ఇంకో ఐదు వేలు వేసి ఇచ్చేవాడిని..’ అంటున్నారు జనసేన అధినేత, వాలంటీర్లను ఉద్దేశించి. ఈ మాట వాలంటీర్లకు గట్టిగా ఎక్కేస్తోంది. మరి, వైసీపీ.. వాలంటీర్ల వేతనాన్ని పెంచుతామని ప్రకటిస్తుందా.? ప్రకటించకపోతే కష్టమే. ఎందుకంటే, టీడీపీ కూడా వాలంటీర్ల గౌరవ వేతనం పెంచుతామనే నినదిస్తోంది.

ఇలాంటివన్నీ, వాలంటీర్లను పునరాలోచనలో పడేస్తాయ్. వాలంటీర్ వ్యవస్థని వైసీపీ చాలా గట్టిగా నమ్ముతోంది. ఓటర్లతో వైసీపీకి ఓట్లేయించే బాధ్యతనీ వాలంటీర్ల మీదనే పెడుతోంది వైసీపీ.. అనధికారికంగా. సరిగ్గా, ఆ వాలంటీర్ వ్యవస్థ మీదనే దెబ్బ కొట్టారు జనసేనాని. ఏమవుతుందో ముందు ముందు ఈ వ్యవహారం.!