వాలంటీర్లు.! దండుపాళ్యం బ్యాచ్.! పవన్ కొత్త రగడ.!

వైసీపీ వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్‌తో పోల్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘దండుపాళ్యం బ్యాచ్‌కీ వైసీపీకీ ఏమన్నా తేడా వుందా.?’ అన్నది ఆయన చేసిన వ్యాఖ్యల సారాంశం.

వాలంటీర్ ఒకడు, ఎవరూ లేని సమయంలో ఓ ఇంట్లో దూరి, ఓ వృద్ధురాల్ని చంపేసిన ఘటన విశాఖలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పెను దుమారానికి కారణమయ్యింది. ఆ వాలంటీర్ ‘మాజీ’ అంటూ వైసీపీ సర్కారు బుకాయించేందుకు నానా తంటాలూ పడాల్సి వచ్చింది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థని తీసుకొచ్చిన మాట వాస్తవం. వైసీపీ కార్యకర్తలకే వాలంటీర్ పోస్టులు ఇచ్చుకున్నదీ వాస్తవం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలే ఈ విషయాల్ని వెల్లడించారు.

రెండున్నర లక్షల మంది వాలంటీర్లు వుంటే, అందులో కొందరు దారుణాలకు పాల్పడుతున్నదీ వాస్తవం. వాళ్ళు వైసీపీ కార్యకర్తలే గనుక, నైతిక బాధ్యత వైసీపీ పార్టీనే తీసుకోవాల్సి వుంటుంది. ప్రభుత్వమూ ఈ విషయమై బాద్యతగా వ్యవహరించాలి.

సరే, వాలంటీర్లంతా అలాగే వుంటారా.? కొన్ని ఘటనల్ని పట్టుకుని, హ్యూమన్ ట్రాఫికింగ్ అనో.. దండుపాళ్యం బ్యాచ్ అనో అనడం సబబు కాదు కదా.! కానీ, జనసేన అధినేత మీద ‘ప్యాకేజీ స్టార్.. దత్త పుత్రుడు’ అని వైసీపీ విమర్శిస్తున్నప్పుడు, ఆ వైసీపీ వాలంటీర్ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ ‘హ్యూమన్ ట్రాఫికింగ్, దండుపాళ్యం’ అనే విమర్శలు చేయడంలో వింతేముంది.?

కాగా, గతంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలపై వైసీపీ మహిళా వాలంటీర్లు కొందరు గుస్సా అయ్యారు. ఆ తర్వాత ఆ వివాదం కాస్త సద్దుమణిగింది.

ఇప్పుడేమో, దండుపాళ్యం రగడ షురూ అయ్యింది. పవన్ కళ్యాణ్ మీద నానా రకాల విమర్శలూ వైసీపీ నేతలు చేస్తోంటే.. దానికి కౌంటర్ ఎటాక్ జనసేన కూడా గట్టిగానే ఇస్తోంది.