విశాఖ రగడ.! వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే.!

మంత్రులకు రక్షణ కల్పించలేని పోలీసు వ్యవస్థ.! విశాఖలో జరిగిన ఘటన విషయంలో సర్వత్రా వ్యక్తమవుతోన్న అభిప్రాయమిదే. ఇది కేవలం పోలీసు వ్యవస్థ వైఫల్యమే కాదు. ప్రభుత్వ వైఫల్యం కూడా. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్న ఓ కార్యక్రమం.. లక్షలాదిమంది గుమికూడతారని మంత్రులే ప్రకటించుకున్న వైనం.. ఇదంతా కళ్ళ ముందు కనిపించింది.

మరి, పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారు. ఎయిర్ పోర్టు ద్వారా మంత్రులు తిరిగి వెళతారు.! ఆ మంత్రులే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద నీఛాతి నీఛమైన విమర్శలు చేసి, సవాళ్ళు విసరడమే కాదు.. హెచ్చరికలు కూడా చేశారు.. ఆ పవన్ కళ్యాణ్ అదే సమయంలో విశాఖకు వస్తున్నారంటే, పోలీసు శాఖ ఇంకెంత బాధ్యతగా వ్యవహరించాలి.?

కొన్నాళ్ళ క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖపట్నం వస్తే, విమానాశ్రయం దగ్గరే ఆయన్ని అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో హైకోర్టు, పోలీసు వ్యవస్థకు చీవాట్లు పెట్టింది కూడా.! కానీ, హైకోర్టు చీవాట్లతో పోలీసు వ్యవస్థ పాఠం నేర్చుకోలేదా.? ప్రభుత్వం బాధ్యతగా వుండాలన్న సోయ లేకుండా వ్యవహరించిందా.?

పవన్ కళ్యాణ్ అభిమానులో, జనసైనికులో దాడులు చేశారని కేసులు పెడితే సరిపోదు. ఘటన జరిగాక ఎన్ని కేసులు పెట్టినా.. జరిగిన నష్టాన్ని అయితే పూడ్చలేరు కదా.! పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు వస్తారు.. జనసైనికుల హంగామా వుంటుంది. ముఖ్యమంత్రి పర్యటనలకు పరదాలు కడుతున్నారు కదా.. మరి, అక్కడ ప్రదర్శించే శ్రద్ధ.. జనసేన అధినేత విషయంలో ఎందుకు వుండదు.? మంత్రుల విషయంలో ఎందుకు వుండదు.?

విశాఖ రణ రంగంగా మారడానికి పోలీసుల వైఫల్యమే కారణమనే విమర్శలు వస్తున్నాయి. విశాఖ పోలీసులు ఎందుకు ఈ అపప్రధని మోయాల్సి వస్తోంది. ఇదే విశాఖ వేదికగా ‘ఏపీ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు..’ అని గతంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఆ వ్యవస్థ ఇప్పుడు వైసీపీ హయాంలో కూడా ఫెయిలయ్యింది. మొత్తంగా ప్రభుత్వే ఫెయిలయ్యింది.. తమ మంత్రులకు రక్షణ కల్పించలేనంత అచేతనావస్థలో వుంది ప్రభుత్వం.