కాపులుప్పాడ.. ఆనందపురం వయా 6 లేన్ రోడ్‌లో రాజధాని
ఆంధ్ర ప్రదేశ్ కి విశాఖ పట్నం పాలనా రాజధాని ఖాయం కాగానే స్థానికంగా సంబరాలు అంబరాన్ని తాకిన సంగతి తెలిసిందే. రాజధాని రాకతో కాకినాడ మొదలు విశాఖ పట్నం వరకూ.. విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం రెజియన్ వరకూ శరవేగంగా అభివృద్ధి సాధ్యపడుతుందని ఉత్తరాంధ్రలో చర్చ జరుగుతోంది. ఇందుకు ఇప్పటికే సీఎం జగన్ వద్ద ప్రణాళికలు స్పష్టంగా ఉన్నాయని అంతా నమ్ముతున్నారు. దాదాపు 3లక్షల కోట్ల మేర దీర్ఘ కాలంలో విశాఖ- ఉత్తరాంధ్రకు పెట్టుబడులు వస్తాయని.. కొత్త రాజధాని ప్రాంతంలో జెట్ స్పీడ్ తో పనులు పూర్తి చేయనున్నారని సాక్షిలో కథనాలు వెలువడడం ఆసక్తిని పెంచింది.
ఇకపోతే విశాఖ రాజధాని ప్రకటించక ముందే ఏ ప్రాంతంలో క్యాపిటల్ ఉంటుంది? అన్నదానిపై ఇంతకుముందు `తెలుగు రాజ్యం` ఎక్స్ క్లూజివ్ కథనం వెలువరించింది. రాజధాని ప్రాంతం ఎక్కడి నుంచి అంటే.. విశాఖ ఔటర్ – పెందుర్తి టు ఆనందపురం మొదలు విజయనగరం వరకూ 6 లైన్ల రోడ్ రెడీ అయ్యింది.. ఈ రోడ్ వెంబడి రాజధాని డెవలప్ మెంట్ ప్లాన్ ఉంటుందని ఇంతకుముందు పలువురు వైకాపా నాయకులు ప్రకటించారు. భీమిలి కాపులుప్పాడ విజయసాయి సహా వైకాపా పెద్దలకు బాగా నచ్చాయి. అక్కడ కొన్ని ఆఫీసులు ఉంటాయని .. విశాఖ- విజయనగరం ఇరు జిల్లాల్ని కలుపుకుని.. మధ్యలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి జెట్ స్పీడ్ గా పావులు కదుపుతున్నారని..ఇంతకుముందు వెల్లడించాం. అందుకు తగ్గట్టే ఏపీ సీఎం ప్లాన్ ఉందని తాజాగా ఓ ప్రముఖ పత్రిక కథనం వెలువరించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
విశాఖ పరిపాలనా రాజధాని ప్లాన్ లో భాగంగా నాలుగైదు ఏరియాలు కీలకంగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రతిచోటా అభివృద్ధికి నిర్మాణాల కోసం వందల కోట్లను ఖర్చు చేయనున్నారు. బీచ్ పరిసరాల్లోని కాపులుప్పాడ పాలనా రాజధానిగా ఉంటుంది. ఇక్కడ దాదాపు 1000 ఎకరాల్ని రాజధాని కోసం డెవలప్ చేయనున్నారు. భీమిలి బీచ్ రోడ్ లోని తిమ్మాపురం గ్రేహౌండ్స్ స్థలంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఏర్పాటు కానుంది. ఇక్కడ నుంచి గ్రేహౌండ్స్ ని ఆనందపురం ఏరియాకి తరలించారు. అక్కడ 300 ఎకరాలు కేటాయించారు. దీంతో తిమ్మాపురం గ్రేహౌండ్స్ స్థలంలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం మొదలైంది. పర్యాటక శాఖ అతిథి గృహాలు ఉన్న రుషికొండపై సీఎం నివాసం ఏర్పాటు చేయనున్నారని సమాచారం.
ఇదేగాక విశాఖ నగరంలో మెట్రో రైల్ సహా ట్రామ్ ట్రెయిన్ ఏర్పాటుకు శరవేగంగా పావులు కదుపుతున్నారు. దాదాపు 70 నుంచి 140 కిలోమీటర్ల పొడవునా మూడు కారిడార్లుగా మెట్రో ప్రతిపాదన ఉంది. దీనిని వెంటనే ప్రారంభించనున్నారు. ఇక సాగర తీరం (సముద్రం వెంబడి) భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ ట్రామ్ ట్రెయిన్ ని ఏర్పాటు చేయనున్నారు. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసింది. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ఇక వేగం పుంజుకోనున్నాయి. విశాఖ కేంద్ర కారాగారానికి సింహాచలం దేవస్థానం భూముల్ని ఇచ్చారు. వాటిని డీజీపీ- పోలీస్ శాఖల కార్యాలయానికి కేటాయించనున్నారు. వీటితో పాటు భీమిలి పరిసరాల్లో టాలీవుడ్ ఏర్పాటునకు సన్నాహాలు చేయనున్నారని తెలుస్తోంది. ఆగస్టు 15 న సీఎం జెండా వందనం సాక్షిగా చాలా ఆఫీసుల నిర్మాణానికి పునాది రాళ్లు వేయనున్నారని తెలుస్తోంది.