మరో ఉగాది.! విశాఖ రాజధాని ఏమైంది.?

ఇటు హైకోర్టులోనూ, అటు సుప్రీంకోర్టులోనూ ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాజధానుల వ్యవహారాలకు సంబంధించి కేసులు విచారణ దశలో వున్నాయి. మూడు రాజధానుల అంశానికి వైసీపీ సర్కారే అసెంబ్లీ సాక్షిగా చెల్లు చీటీ పాడేసింది. మరి, విశాఖ రాజధాని ఎలా సాధ్యం.? ‘ఉగాది నుంచి విశాఖ వేదికగానే పాలన’ అంటూ వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. మంత్రులూ అదే దిశగా సంకేతాలూ పంపారు. ముఖ్యమంత్రి, ‘ఉగాది’ అని చెప్పలేదుగానీ, విశాఖనే రాజధానిగా ప్రకటించేసుకున్నారు. ‘వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ రాజధానిగా పాలన..’ అంటూ మంత్రులు పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే.

ఉగాది వచ్చేసింది. విశాఖలో రాజధాని సందడేమీ లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతి నుంచి విశాఖకు మకాం అయితే మార్చలేని పరిస్థితి. సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతున్న దరిమిలా, తీర్పు వచ్చేదాకా ఏం చేయడానికి వీల్లేదు. మరి, మంత్రులెందుకు అడపా దడపా ముహూర్తాలు పెడుతున్నట్లు.?

తాజాగా, మంత్రి గుడివాడ అమర్నాథ్ ‘డేట్ మీకెందుకు చెప్పాలి.?’ అంటూ రాజధాని విశాఖ విషయమై మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ గుస్సా అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో (గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ) ఉత్తరాంధ్రలో వైసీపీకి షాక్ తగిలిన దరిమిలా, విశాఖ రాజధాని అంశాన్ని వైసీపీ సర్కారు అటకెక్కించిందనే ప్రచారమూ లేకపోలేదు.

వచ్చే ఏడాది.. అంటే, 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. జులైలో విశాఖకు వెళుతున్నాం.. అని ముఖ్యమంత్రి ఇటీవల క్యాబినెట్ సహచరులకు సమాచారమిచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జులై అంటే ఏంతో దూరం లేదు. చూద్దాం.. ఏం జరుగుతుందో.!