విశాఖ రాజధాని కళను సంతరించుకుంటోంది. మరోపక్క ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా మారేదిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇన్ఫోసిస్ శాటిలైట్ సెంటర్ ని విశాఖలో ప్రారంభిస్తూ ఏపీ సిఎం వైఎస్ జగన్… రానున్న కాలంలో మరిన్ని ఐటీ కంపెనీలు విశాఖకు క్యూ కడతాయని జోస్యం చెప్పారు. ఈ క్రమంలో ఆమాటను నిజం చేస్తూ… తన ఐటీ కార్యకలాపాలు విశాఖలో విస్తరించాలని దిగ్గజ సంస్థ విప్రో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా… విశాఖలో ప్రాజెక్ట్ లావెండర్ పేరుతో విప్రో తన కార్యకలాపాలను పూర్తిగా విస్తరించనున్నట్లుగా ప్రకటించింది. దీంతో… ఈ ఏడాది చివరి నాటికి విప్రో సంస్థ విశాఖలో తన సంస్థను విస్తరించే పనులు ప్రారంభిస్తుందని అంటున్నారు. విశాఖలో పనిచేసేందుకు ఉత్సాహం ఉన్న ఉద్యోగుల వివరాలను కూడా విప్రో సేకరిస్తోందని, అనంతరం వారిని విశాఖకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తొందని అంటున్నారు.
అయితే ఇది ఈ రెండు కంపెనీలతోనే ఆగిపోయేలా కనిపించడం లేదని తెలుస్తోంది. ఇందులో భాగంగా… ఇన్ఫోసిస్, విప్రో తరువాత మరిన్ని ఐటీ కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్ మొదలైన ఐటీ కంపెనీలు విశాఖలో తన సేవలను అందించేందుకు ముందుకు వస్తున్నాయట.
ఆ సంగతి అలా ఉంటే… మరోవైపు డిసెంబర్ నాటికి మకాం మారుస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. దీనికి బలం చేకూర్చే పరిస్థితులు సాగరతీరంలో కనిపిస్తున్నాయి. క్యాంపు కార్యాలయంగా ప్రచారంలో ఉన్న ఋషికొండలో నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇదే సమయంలో జగన్ కంటే ముందే మంత్రులు విశాఖకు మకాం మార్చే పనిలో పడిపోయారు.
వీరిలో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, అప్పలరాజు సహా మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలకు ఇప్పటికే విశాఖలో నివాసాలు ఉన్నాయి. రాజకీయ, వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలు నగరంతోనే ముడిపడి ఉండటంతో ఇక్కడ గెస్ట్ హౌస్ లు, ఫ్లాట్స్ కొనుగోలు చేశారని చెబుతున్నారు.
ఇదే క్రమంలో… అమాత్యులు ఒక్కొక్కరుగా ఇక్కడ ఇళ్లు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తుంది. బీచ్ రోడ్డు, ఋషికొండ, మధురవాడ, సీతమ్మధార వంటి కీలకమైన చోట్ల భవనాలు వెతుక్కొని మకాం పెట్టేస్తున్నారట. వీరిలో… మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తాను నాలుగు నెలల క్రితమే వైజాగ్ షిఫ్ట్ అయిపోయానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది చివరి నుంచి వైజాగ్ లుక్ ఒక్కసారిగా మారిపోబోతోందని అంటున్నారు.