సినీ నటుడు, నిర్మాత మంచు విష్ణు, ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్లు గతంలో ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుతానికి అధికారికంగా ప్రకటితమైనదాన్నిబట్టి, ప్రకాష్ రాజ్.. ఆ తర్వాత మంచు విష్ణు పేరు వినిపిస్తోంది ‘మా’ అధ్యక్ష ఎన్నిక కోసం.
అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అనే ఓ చిన్న అసోసియేషన్‌లో వున్నదే వెయ్యి మంది కంటే తక్కువ సభ్యులు. అందులో యాక్టివ్ సభ్యులెంతమంది.? ఓట్లేసేవారెంతమంది.? అన్నది మళ్ళీ గందరగోళం. కానీ, సినీ పరిశ్రమకు సంబంధించిన అంశం కాబట్టి, రచ్చ అనూహ్యమైన స్థాయిలో జరుగుతోంది మీడియాలో.
ఇక, మంచు విష్ణు తాజాగా మరో ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ‘మా’ అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవమైతే తాను ఎన్నికల బరిలోంచి తప్పుకుంటానని, ఇందుకు సినీ పరిశ్రమ పెద్దలంతా సహకరించాలని కోరాడు ఆ ప్రకటనలో మంచు విష్ణు. ఇక్కడ, సినీ పరిశ్రమ పెద్దలంటే ఎవరు.? మంచు విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు కూడా పరిశ్రమ పెద్దల్లో ఒకరు.
తమ్మారెడ్డి భరద్వాజ సహా చాలామంది పరిశ్రమ పెద్దలున్నారు. దాసరి నారాయణరావు మరణం తర్వాత, మెగాస్టార్ చిరంజీవి చుట్టూ సినీ పరిశ్రమలోని రాజకీయాలు కేంద్రీకృతమైపోయాయన్నది నిర్వివాదాంశం. కానీ, చిరంజీవి పెద్దరికాన్ని తెలుగు సినీ పరిశ్రమలో కొందరు వ్యతిరేకిస్తున్నారు. దాంతో, చిరంజీవి తన వద్దకు ఎవరైనా సమస్య కోసమో, సాయం కోసమో వస్తే.. తాను చెయ్యాలనుకున్నది చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో వివిధ అంశాలపై చర్చించేందుకూ చిరంజీవి ముందుంటున్నారు. చిరంజీవి వెంట నాగార్జున తదితరులు వెళుతున్న సంగతి తెలిసిందే. సో, ఇక్కడ ‘మా’ అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం కావాలంటే, ఎవరో ఒకరు లీడ్ తీసుకోవాలి. చిరంజీవి లీడ్ తీసుకుంటే, ఆ తర్వాత చోటు చేసుకునే సినీ రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. మంచు విష్ణు.. తన తండ్రినే ఈ విషయమై ముందుకు నడిపితే.. బావుండేదేమోనన్నది చాలామంది అభిప్రాయం.