Kannappa Hard Drive: టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఈ సినిమాలో మంచు విష్ణు తో పాటు చాలామంది స్టార్లు నటిస్తున్న విషయం తెలిసిందే. కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనా అప్డేట్లు సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి. ఇది ఇలా ఉంటే కన్నప్ప మూవీకి సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన హార్డ్ డ్రైవ్ మాయమైన సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైకి చెందిన వీఎఫ్‌ఎక్స్ విక్రేతల్లో ఒకరు (హైవ్ స్టూడియోస్) కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలకమైన డేటాతో కూడిన హార్డ్ డ్రైవ్ ను డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిలింనగర్ లోని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి పంపించారు. డీటీడీసీ డెలివరీ రికార్డుల ప్రకారం పార్శిల్ ఈ నెల 25న కార్యాలయానికి చేరుకుంది. పార్శిల్ అందుకున్న ఆఫీస్ బాయ్ రఘు దానిని చరిత అనే యువతికి అప్పగించాడట. కార్యాలయ సిబ్బంది క్రాంతి హార్డ్‌డ్రైవ్ విషయమై రఘును ప్రశ్నించగా తాను చరితకు ఇచ్చినట్లు చెప్పాడట. అయితే చరిత హార్డ్ డ్రైవ్ తీసుకున్నప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతోందట.
కొందరు వ్యక్తుల మార్గ దర్శకత్వంలో పని చేస్తున్న చరిత సినిమా ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే కనిపించకుండా పోయిందంటూ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన రెడ్డి విజయ్ కుమార్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా తమ సినిమా ప్రాజెక్టుకు తీవ్ర అంతరాయం కలిగించిందని అన్నారు. సదరు హార్డ్‌డ్రైవ్ లో కన్నప్ప చిత్రానికి సంబంధించి విడుదల చేయని, గోప్యమైన, అత్యంత సున్నితమైన డేటా ఉందని అన్నారు. ఈ కంటెంట్ ను లీక్ చేయడం లేదా, డిలీట్ చేయడం ద్వారా తమ సంస్థ ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బతింటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే హార్డ్‌డ్రైవ్ ను రికవరీ చేసి తమకు అప్పగించాలని కోరారు. ప్రస్తుతం యువతి పరార్ లో ఉంది.