విశాఖ ఎంపీ సీటు.! వైసీపీలో రోజుకో కొత్త పుకారు.!

విశాఖ ఎంపీ సీటు, ఏపీ రాజకీయాల్లో హీటు పుట్టిస్తోంది. ఈ సీటుపై ప్రధాన రాజకీయ పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈసారి అసెంబ్లీకీ అలాగే లోక్ సభకీ పోటీ చేయబోతున్నారనీ, ఎంపీ సీటు విశాఖపట్నమేననీ ఓ గాసిప్ పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ విషయమై జనసేన వర్గాల దగ్గర ప్రస్తావిస్తే, ‘ఫేక్ న్యూస్’ అని కొట్టి పారేశారు. ఈసారి ఒకే ఒక్క నియోజకవర్గం నుంచి జనసేనాని పోటీ చేయబోతున్నారన్న స్పష్టత అయితే జనసేన నుంచి వస్తోంది. రెండో నియోజకవర్గం విషయమై జనసేనాని అంత ఆసక్తి చూపడంలేదట.

ఇదిలా వుంటే, విశాఖ ఎంపీ సీటుకి సంబంధించి వైసీపీ, మల్లగుల్లాలు పడుతోంది. ఇంకోసారి ఎంపీగా ఎంవీవీ సత్యనారాయణను బరిలోకి దించేందుకు వైసీపీ అధినాయకత్వం సుముఖంగా లేదు. ఎమ్మెల్సీ వంశీ కృష్ణని ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించాలుకుంటోందట వైసీపీ.

స్థానిక వైసీపీ శ్రేణులేమో, విశాఖ లోక్ సభ సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పోటీ చేయాలంటున్నాయి. ఈ దిశగా వైసీపీ విశాఖ శ్రేణులు అధినాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విజయసాయిరెడ్డే స్వయంగా వాళ్ళందర్నీ రెచ్చగొడుతున్నారా.? అన్న అనుమానాలూ లేకపోలేదు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.

మరోపక్క, టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపైనా భిన్నవాదనలున్నాయి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణను టీడీపీలోకి లాగేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట. వైసీపీ టిక్కెట్ ఇచ్చినా, అటువైపు వెళ్ళాలని జేడీ లక్ష్మినారాయణ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో జనసేన నుంచి జేడీ, విశాఖ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేశారు. ఈసారి ఆయన్ని తిరిగి రప్పించుకునేందుకు జనసేన సుముఖంగా లేదు.