ఆత్మకూరు ఉప ఎన్నిక: విక్రమ్ రెడ్డి గెలుపు.. ఊహించిందే కదా.!

మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నిజానికి, ఇది ‘ఘన’ విజయమే. కానీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సహా, జనసేన కూడా ఎన్నికల బరిలోకి దిగకపోవడంతో, దీన్ని సాధారణ విజయంగానే చెప్పుకోవాలి. వైసీపీ మాత్రం, ‘బంపర్ విక్టరీ’ అంటోంది. బీజేపీకి డిపాజిట్లు కూడా రాలేదని వెటకారం చేస్తోంది.

బీజేపీకి ఆత్మకూరులో డిపాజిట్ వస్తుందని ఎవరైనా అనుకున్నారా.? ఛాన్సే లేదు. ఎందుకంటే, ఆత్మకూరు ఉప ఎన్నిక, సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో జరిగింది. పైగా, గౌతమ్ రెడ్డి అజాత శతృవు. ఆయనకు అన్ని పార్టీల్లోనూ ఆత్మీయులు వున్నారు. ఆయా పార్టీలకు చెందిన నేతలతో, అధినేతలతోనూ ఆయనకు ఆత్మీయ సంబంధాలున్నాయ్.

అందుకే, గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిసి, టీడీపీ కావొచ్చు.. జనసేన కావొచ్చు.. తమ అభ్యర్థుల్ని నిలబెట్టలేదు. సరే, టీడీపీ అలాగే జనసేన పోటీ చేసినా గెలిచేవి కాదా.? అంటే, అది వేరే చర్చ.

రెండు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ చేయనప్పుడు, ఆ ఉప ఎన్నికలో వచ్చిన గెలుపుని అధికార పార్టీ ‘సెలబ్రేట్’ చేసుకుంటే, అది గౌతమ్ రెడ్డికే అవమానమన్నది రాజకీయ విశ్లేషఖుల వాదన. ఇలాంటివాటికి సంబరపడిపోవడం హాస్యాస్పదమే. ఎందుకంటే, త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయ్. దానికి పూర్తిగా రెండేళ్ళ సమయం కూడా లేదాయె.!