వైసీపీలోకి విజయమ్మ మళ్ళీ వస్తారట.!

తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల సాధించిందేమీ లేదన్నట్టు తయారైంది వ్యవహారం. పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేస్తారో లేదో కూడా డౌటే. ఆమె తనకు రాజ్యసభ పదవి ఇస్తే చాలన్నట్టుగా గతంలో బీజేపీతో, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో బేరాలాడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ కోసం తాను అదనంగా చేసేదేమీ వుండదనే భావనకు వైఎస్ విజయమ్మ వచ్చారట. తిరిగి ఏపీ రాజకీయాల్లోకి వెల్ళాలని ఆమె నిర్ణయించుున్నట్లుగా ఓ ‘పుకారు’ తెరపైకొచ్చింది. దీన్ని కేవలం పుకారుగా మాత్రమే చూడాలా.? అన్నదానిపై వైసీపీ శ్రేణుల్లో కొంత గందరగోళం వుంది.

వైఎస్ విజయమ్మ గనుక వైసీపీలోకి తిరిగి వస్తే, రాజకీయ ప్రత్యర్థుల నోళ్ళకు తాళాలు పడతాయని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే, గౌరవాధ్యక్షురాలి పదవికి ఆల్రెడీ రాజీనామా చేసిన విజయమ్మ, కుమార్తెని కాదని.. తిరిగి కుమారుడి వద్దకు రాజకీయం విషయమే దేహీ.. అంటూ వెళతారా.? అన్న ప్రశ్న వైసీపీ రాజకీయ ప్రత్యర్థుల నుంచి వస్తోంది.

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. కూతురికి రాజకీయంగా అండదండలు అందిద్దామనుకున్నారు. కానీ, అది కుదరలేదు. దాంతో, రాజకీయంగా ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో సరైన నిర్ణయం.. అదీ కుమారుడి దగ్గరకే తిరిగి వెళ్ళాలనే నిర్ణయం విజయమ్మ తీసుకుంటే, అందులో తప్పు పట్టడానికి ఏముంటుంది.?

వైసీపీకి దూరంగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరంగా తన తల్లి వైఎస్ విజయమ్మ వెళ్ళినా, ఆమె పట్ల అదే ఆప్యాయతను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. వైఎస్ విజయమ్మ కూడా అంతే.! అన్నీ అనుకున్నట్లు జరిగితే, సెప్టెంబర్ మొదటి వారంలో వైఎస్ విజయమ్మ తిరిగి వైసీపీలో చేరే అవకాశం వుందట.