బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందా.? వైసీపీ గెలుస్తుందా.? నిజానికి ఇక్కడ వైసీపీకి టీడీపీ గట్టి పోటీనే ఇస్తోంది. జనసేన కూడా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ మద్దతుతో. అయితే, టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న యుద్ధం ఆ పార్టీకి సంకటంగా మారింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని వైఖరితో విసిగిపోయిన టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా.. మీడియా ముందుకొచ్చారు.. కేశినేని నానిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. కేశినేని నాని ఇదే వైఖరి కొనసాగిస్తే, ఆయన తరఫున చంద్రబాబు బెజవాడ పర్యటనకు వచ్చినప్పుడు తాము ఆ పర్యటనకు దూరంగా వుంటామని బొండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా ప్రకటించడం గమనార్హం. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. అసలే పంచాయితీ ఎన్నికల్లో దెబ్బతినేసి డీలా పడ్డ టీడీపీకి, బెజవాడలో ఈ ‘కొబ్బరి చిప్పల’ పంచాయితీ కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది.
బెజవాడ టీడీపీలో చాలాకాలంగా ఈ కొబ్బరి చిప్పల పంచాయితీ నడుస్తోంది. ‘కొబ్బరి చిప్పల దొంగలు..’ అంటూ గతంలో కేశినేని, బుద్ధా వెంకన్నపై విమర్శలు చేసిన సంగతి తెల్సిందే. కేశినేని నాని బస్సుల రగడ, బుద్ధా వెంకన్న కొబ్బరి చిప్పల రగడ.. వెరసి అప్పట్లో టీడీపీ బెజవాడలో అభాసుపాలయ్యింది. 2019 ఎన్నికల్లో విజయవాడ పరిధిలో టీడీపీ దెబ్బతినడానికి పార్టీలో అంతర్గత కుమ్ములాటలే కారణమన్నది బహిరంగ రహస్యం. ఈసారి ఇంకాస్త ముందడుగు వేసి.. కమ్మ – కాపు మధ్య రచ్చలా ఈ వ్యవహారాన్ని మార్చేశారు బెజవాడ టీడీపీ నేతలు. అంతేనా కమ్మ వర్సెస్ బీసీ నేతలు.. అనే స్థాయికి వివాదం ముదిరిపోయింది. మరి, ఈ వివాదంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారు.? వేచి చూడాలి.