సిగ్గు బిల్లని కూడా తాకట్టు పెట్టావ్: రామోజీపై విజయసాయిరెడ్డి ఫైర్.!

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుని ‘రాము’ అనీ, ‘రాము నాయుడు’ అనీ సంబోదించడం మొదలు పెట్టారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. సోషల్ మీడియా వేదికగా తాజాగా రామోజీరావుపై సంచలన ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి.

‘ఈనాడును నెంబర్ వన్ పత్రికగా నిలపాలని కలలు కన్నవాడివి. కులం, ఆస్తుల కోసం సిగ్గుబిళ్ళని కూడా తాకట్టు పెట్టావు కదా రాము..’ అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు.
సిగ్గుబిళ్ళ అంటే ఏంటి.?

విజయసాయిరెడ్డి దృష్టిలో ‘సిగ్గుబిళ్ళ’ అంటే ఏంటోగానీ, ఆయన ట్వీటు మాత్రం వైరల్ అయ్యింది. ‘దక్షిణాదిలో మలయాళ మనోరమ 20 లక్షల కాపీలతో దూసుకుపోతోంది. చెత్త రాతలను అసహ్యించుకుని ప్రజలు ఈనాడుని ఏనాడో మరచిపోయారు..’ అంటూ విజయసాయిరెడ్డి ట్విటాస్త్రం సంధించారు.

సరే, రాజకీయాల్ని పక్కన పెడితే.. అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ.. తెలునాట ఈనాడు మాత్రమే నెంబర్ వన్. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాక్షి పత్రికను తీసుకొచ్చినా.. ఈనాడుతో పోటీ పడలేకపోతోంది. ఈనాడులో టీడీపీ అనుకూల వార్తలుంటాయనేది అందరికీ తెలిసిన విషయమే.

కానీ, ఒక వార్త నిజమా.? కాదా.? అని రూఢీ చేసుకోవాలంటే ఎవరైనా ముందుగా ఈనాడులోనే చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈనాటికీ వుంది. ఇంతకీ, రామోజీరావుకి పోటీగా పత్రిక, ఛానల్ తెస్తానన్న విజయసాయిరెడ్డి ఆ దిశగా ఎంత మేర ముందడుగు వేసినట్టు.?