మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మీద రాజకీయంగా ఆధిపత్యం దక్కించుకోవాలనే ఆరాటంలో వున్నారు వైసీపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా అశోక్ గజపతిరాజుపై విమర్శల్ని తీవ్రతం చేశారు కూడా. అట్నుంచి విజయసాయిరెడ్డి మీద కౌంటర్ ఎటాక్ కూడా అప్పుడప్పుడూ గట్టగానే జరుగుతోంది. నిజానికి, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అశోక్ గజపతిరాజుకి ప్రత్యేకమైన స్థానం, గౌరవం వున్నాయి. ఆయన వివాద రహితుడు. రాజవంశీయుడు కావడంతో, ఆయనకు రాజకీయాలకతీతంగా అభిమానులున్నారు.
అన్ని పార్టీల్లోనూ అశోక్ గజపతిరాజుకి అభిమానులున్నారన్నది నిర్వివాదాంశం. అలాంటి అశోక్ గజపతిరాజు మీద రాజకీయంగా విమర్శలు చేయాలనుకున్నప్పుడు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. కానీ, ఆయన మీద అడ్డగోలు విమర్శలతోనే సరిపెడుతున్నారు విజయసాయిరెడ్డి. తాజాగా, గతంలో ఎప్పుడో జరిగిన ఓ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి అశోక్ గజపతిరాజు మీద ఆరోపణలు చేస్తూ, ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నాలుగేళ్ళ క్రితం జరిగిన రైలు ప్రమాదమది. అప్పట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా వున్న అశోక్ గజపతిరాజు, ఆ ఘటనకు సంబంధించిన విచారణను తప్పుదోవ పట్టించారని విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక్కడ విజయసాయి, అశోక్ గజపతిరాజు మీద ఆరోపణ చేయడమంటే, మోడీ సర్కార్ మీద ఆరోపణలు చేస్తున్నట్టే లెక్క. వాస్తవానికి ఆ సమయంలో రైల్వే శాఖ మంత్రిగా వున్న సురేష్ ప్రభు మీద విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయాల్సి వుంది.. ఆయనకేమన్నా అనుమానాలుంటే. ఇదే ఈ అంశమే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇమేజ్‌తోపాటు వైసీపీ ఇమేజ్‌ని కూడా డ్యామేజ్ చేస్తోంది.