ఏపీ బీజేపీ నేతలపై సాయిరెడ్డి సెటైర్లు!

గత రెండు మూడు రోజులులుగా ఏపీలో వైఎస్సార్ సీపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో మైకందుకున్న బీజేపీ అగ్రనేతలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వీరిలో ఇప్పటికే నడ్డాకు పేర్ని నాని కౌంటర్స్ వేయగా.. తాజాగా అమిత్ షా కు విజయసాయిరెడ్డి షాకిచ్చారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ నేతలపైన సాయిరెడ్డి సెటైర్లు వైరల్ గా మారాయి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – భారతీయ జనతా పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెర లేచింది. రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలను వైసీపీ నాయకులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోన్నారు. విశాఖపట్నం, శ్రీకాళహస్తిల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో అమిత్ షా, జేపీ నడ్డా.. ఏపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే. .

ఈ సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో ఏపీలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. అవినీతి, కుంభకోణాల ఆరోపణలు ఉన్నాయని.. వాటిపై తమకు ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లల్లో జగన్ సాధించింది అవినీతి, కుంభకోణాలు తప్ప మరేమీ లేదని ధ్వజమెత్తారు.

ఈ ఆరోపణలపై తాజాగా వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీలో బీజేపీ నాయకులు ఎంత ప్రచారం చేసినా ఉపయోగం ఉండబోదని అన్నారు. బీజేపీ నాయకులు ఏపీలో ఎక్కడికి వెళ్లినా రాష్ట్ర ప్రజలు వారిని నిలదీస్తోన్నారని విజయసాయిరెడ్డి అన్నారు. అందుకే ఢిల్లీ స్థాయి నుంచి నేతలను రప్పించుకుంటోన్నారని పేర్కొన్నారు.

రాష్ట్రానికి కేటాయించాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీల గురించి ప్రజలు నిలదీస్తోన్నారనే కారణంతో ఏపీ బీజేపీ నేతలు జనాల్లోకి రావడం లేదని సాయిరెడ్డి సెటైర్స్ వేశారు. వైజాక్ స్టీలు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించాలంటూ చేసిన ప్రతిపాదనలపై ప్రజలు ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తోన్నారని పేర్కొన్నారు.