వైసీపీలో నెంబర్ 2 ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు విజయసాయిరెడ్డి. ఈయనకు ప్రజల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో స్పష్టత లేదు కానీ పార్టీలో మాత్రం గట్టి పట్టుంది. ప్రతిపక్షంలో ఉండగా పార్టీకి సంబంధించిన సగం విషయాలను ఈయనే చూసుకునేవారు. పలు విషయాల్లో జగన్ కూడ విజయసాయి మాటకు విలువ ఇచ్చేవారు. అధికారంలోకి వచ్చాక ఆయన ప్రాముఖ్యత కొద్దిగా తగ్గింది. ఇతర నాయకులు కోటరీలోకి రావడంతో కొన్ని విషయాలను ఈయన దూరంగా ఉంటున్నారు. కానీ కొత్త రాజధానిగా అవతరించబోతున్న విశాఖ జిల్లా మీద మాత్రం విజయసాయి పట్టు వదలట్లేదు.
జగన్ రాష్ట్రాలను ముగ్గురు నేతల మధ్యన పంచి పార్టీ వ్యవహారాలు చూసుకోమని అన్నారు. ఆ పంపకాల్లో విజయసాయికి విశాఖ జిల్లా వచ్చింది. అప్పటి నుండి విశాఖలో పార్టీ పనులే కాదు పాలనపరమైన పనులు కూడ ఆయనే చూసుకుంటున్నారు. ఈయన తీరుతో తెలుగుదేశం నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విశాఖలో వలసలు దగ్గర్నుండి అధికారుల పనితీరు, ప్రత్యర్థులను నిలువరించడం వరకు అన్నీ ఈయనే. ఈయన తీరు పట్ల అప్పుడప్పుడు సొంత పార్టీ నేతలే నొచ్చుకుంటున్నారు. అలాంటిది ప్రతిపక్షం టీడీపీ ఎంత కిందా మీదా అయిపోతుంది చెప్పనక్కర్లేదు. అందుకే టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కొత్త అస్త్రం బయటకు తీశారు.
విశాఖలో విజయసాయిరెడ్డి ఆటలు కట్టించాలనే ఉద్దేశ్యంతో విజయసాయి నాన్ లోకల్ అని, ఇక్కడ ఆయన పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ విశాఖలో రాజకీయం చేయాలి అనుకుంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని గెలవాలని, విజయసాయి ప్రజలతో సంబంధం లేని రాజ్యసభ సభ్యుడని, ఆయన్ను దమ్ముంటే విశాఖ పార్లమెంట్ స్థానం నుండి లేదా విశాఖ తూర్పు నియోజకవర్గం నుండి బరిలోకి దిగి గెలవాలని సవాల్ విసిరారు. అయితే ఈ విషయాన్ని విజయసాయి కూడ సీరియస్ గా తీసుకున్నారట. నిజమే ఆయన ప్రజల ఓటల్తో సంబంధంలేని రాజ్యసభ సభ్యుడు. ఆయన పదవీ కాలం ఇంకో రెండేళ్లు ఉంది. వచ్చేసారి కూడ ఆయన పెద్దల సభకు వెళ్లగలడు. కానీ టీడీపీ విసురుతున్న సవాళ్లకు సమాధానంగా ఆయన ప్రత్యక్ష పోరులో నిలవాలని భావిస్తున్నారట.
అందుకే రాబోయే ఎన్నికల్లో ఎంపీగా లేదా ఎమ్మెలేగా పోటీచేయాలని భావిస్తున్నారని అందుకోసం ఈసారి రాజ్యసభకు వెళ్లరని వార్తలు నడుస్తున్నాయి. మరి విజయసాయి నిజంగానే టీడీపీ సవాళ్లకు ఊగిపోయి తన రాజ్యసభ పదవిని రిస్కుతో పెట్టుకుంటారేమో చూడాలి. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికలు అంత ఈజీ ఏం కాదు. గతంలో జగన్ తల్లి వైఎస్ విజయమ్మ విశాఖ నుండి పోటీచేసి ఓడిపోయారు.