వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన ఉక్కు పరిరక్షణ పోరాట పాదయాత్ర విజయవంతం అయింది. శనివారం ఐదు నియోజకవర్గాల మీదుగా దాదాపు 25 కి.మీ మేర ఆయన పాదయాత్ర చేశారు. పార్టీ నేతలు, శ్రేణులు, సామాన్య ప్రజలతో కలిసి శనివారం మధ్యాహ్నానికి గాజువాక చేరుకున్నారు. గాజువాక ప్రజలు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటు నినాదాలు చేస్తూ ఆయనకు పెద్ద ఎత్తున పూలతో స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అనేక త్యాగాల ఫలితమే విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు అని తెలిపారు. ప్రైవేటీకరణకు తాము పూర్తిగా వ్యతిరేకమని, పరిశ్రమ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతుంటే తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ లో ఉన్న అధికారులు మన రాష్ట్రానికి చెందినవారు కాదని, వాళ్లే కేంద్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని విజయసాయి ఆరోపించారు. పోస్కో సంస్థ ప్రతినిధులు సీఎం జగన్ ను కలిస్తే, విశాఖలో తప్ప మరెక్కడైనా ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారని విజయసాయి వివరించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.25 వేల కోట్ల మేర రుణభారం ఉందన్నారు. ఆ రుణాలను ఈక్విటీలోకి మార్చడమే కాకుండా, ప్లాంట్ కు సొంతంగా గనులు కేటాయిస్తే మళ్లీ లాభాల బాట పడుతుందని సీఎం జగన్ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశారని వెల్లడించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు.చంద్రబాబు ద్రోహి అని విమర్శించారు. ప్రజలు ఎప్పటికీ చంద్రబాబును క్షమించరన్నారు. ప్రజల ఆకాంక్షను వైఎస్సార్ సీపీ నెరవేరుస్తుందనే నమ్మకంతోనే.. పాదయాత్రను ప్రజలు విజయవంతం చేశారని అన్నారు.