వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నహితుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ఏ1 నిందితుడు కాగా, విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడు. సరే, ఆ కేసు కాంగ్రెస్ పార్టీ కుట్రల కారణంగా పెట్టబడిందన్నది వేరే చర్చ.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాల్ని గతంలో విజయసాయిరెడ్డి చూసుకునేవారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపనలో విజయసాయిరెడ్డి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. వైసీపీలో నెంబర్ టూ ఎవరు.? అంటే, ఒకప్పుడు విజయసాయిరెడ్డి పేరే వినిపించేది. ఆ తర్వాత ఆ స్థానం సజ్జల రామకృష్ణారెడ్డికి దక్కిందనుకోండి.. అది వేరే విషయం.
ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విజయసాయిరెడ్డికి ‘కొనసాగింపు’ వుండదనే ప్రచారం తెలుగుదేశం పార్టీ గట్టిగా చేసింది. విజయసాయిరెడ్డి మీద నానా రకాల వెటకారాలూ టీడీపీ నేతలు చేశారు. ‘పార్టీ నుంచి బయటకు గెంటేస్తున్నారట కదా..’ అంటూ విజయసాయిరెడ్డి మీద టీడీపీ చేసిన వెటకారాలు అన్నీ ఇన్నీ కావు.
గతంలో ఉత్తరాంధ్ర వైసీపీ అంటే విజయసాయిరెడ్డి పేరే వినిపించేది. ఆ తర్వాత ఆ బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డిని తప్పించారు వైఎస్ జగన్. దాంతో, టీడీపీ వెటకారాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ పదవి కొనసాగింపు విషయమై విజయసాయిరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధినేత మెప్పు పొందేందుకు చాలా చాలా పనులు చేశారు.
వెరసి, విజయసాయిరెడ్డి ప్రయత్నాలు ఫలించి, ఆయనకు కొనసాగింపు లభించింది. ‘ఇది మా ఘనతే.. విజయసాయిరెడ్డి మాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి..’ అంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.