తెనాలి పర్యటన సందర్భంగా జగన్ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తనకు అత్యంత సమీపంగా ఉన్నవారిలో ఒకరుగా భావించబడిన మాజీ మంత్రి విడదల రజినీకి ఈసారి జగన్ ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జగన్ పక్కన ఆమె కనిపించకపోవడం, మీడియా ముందుకు రాకపోవడం ఆమెను తుది వరుసలో నిలబెట్టినట్టు కనిపిస్తోంది.
రాజకీయాల్లో రజినీకి ఇప్పటివరకు మంచి ప్రాధాన్యం లభించింది. ఆమెను మంత్రి పదవికి కూడా నియమించడమే కాకుండా, జిల్లాలోని కీలక కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర ఇచ్చారు. కానీ ఇటీవల ఆమెపై వచ్చిన ఆరోపణలు పార్టీకి మచ్చతలవుతున్నాయన్న అభిప్రాయం వ్యాపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. రజినీకి సంబంధించిన వివాదాలు వరుసగా వెలుగు చూస్తుండటంతో జగన్ ఆమెను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్టే కనిపిస్తోంది.
ఇటీవల రజినీ మరిది గోపి అరెస్ట్ కావడం, కార్యకర్తతో వాగ్వాదం చేయడం వంటి ఘటనలు పార్టీకి ఇబ్బందికరంగా మారినట్టు సమాచారం. గతంలో ఇలాంటివి జరిగితే కూడా జగన్ స్పష్టంగా స్పందించేవారు. కానీ ఈసారి మాత్రం ఆయన పూర్తి మౌనాన్ని పాటించడంతో.. ఇది ఒక వ్యూహాత్మక నిర్ణయమేనన్న అనుమానాలు మొదలయ్యాయి.
తెనాలిలో జరిగిన ఈ పరిణామం పార్టీ అంతర్గత రాజకీయాల్లో మార్పులకు సంకేతంగా భావించవచ్చు. రజినీకి ఇచ్చే ప్రాధాన్యంలో కోత పెడుతూ జగన్ తన శైలిని మార్చుతున్నట్టు కనపడుతోంది. మరోవైపు, ఈ పరిణామాల నేపథ్యంలో రజినీ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది. ఓసారి ఆదరించిన నేతను ఇలా వెనక్కు నెట్టి పెట్టడం జగన్ పాలనలో ఒక కొత్త మలుపే.