ఏపీలో సంక్షేమం దూసుకుపోతుందని చెబుతున్నారు. విద్య, వైద్య రంగాల్లో జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని చెబుతున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి పనితీరుని నిలబెట్టి ప్రశ్నించేదిగా ఉందనడంలో సందేహం లేదు! 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఇప్పటివరకూ వెచ్చించిన సమయమే ఇందుకు ఉదాహరణ. అది కూడా మంత్రి ఇలాకాలో కావడం కొసమెరుపు.
వివరాళ్లోకి వెళ్తే… వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజిని సొంత జిల్లా పల్నాడులోని మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ విజయపురిసౌత్ లో నడుస్తోంది. నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న తండాల్లో ఎవరికి అనారోగ్య సమస్య వచ్చినా.. విజయపురిసౌత్ కమ్యూనిటీ ఆసుపత్రికే వస్తారు. దీంతో పాత భవనం సరిపోవడం లేదని, దాని స్థానంలో కొత్త భవనానికి 2021 జనవరిలో శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వం ఆలోచన మంచిదే అవ్వొచ్చు.. మంత్రిగారి ఆధ్వర్యంలోని ఆచరణ మాత్రం అలా లేదని తెలుస్తుంది. కారణం 2021 జనవరిలో శంకుస్థాపన చేసిన ఈ ఆసుపత్రిని రూ.5.32 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం ప్రారంభించారు. ఈ క్రమంలో ఏడాదిలోపు అందుబాటులోకి తీసుకురావాలని ధ్యేయంగా పెట్టుకున్నారు. అంటే… 2022 జనవరినాటికన్నమాట!
అంచనాలు అలా ఉంటే… పనులు మాత్రం మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా… 2021 జజనవరిలో ప్రారంభమైన ఈ నిర్మాణం ఇప్పటివరకూ పూర్తవలేదు. ఎప్పటికి పూర్తవుతుందనేది పెద్ద ప్రశ్నగా ఉంది. దీంతో… ప్రస్తుతం సాగర్ డ్యాం క్వార్టర్స్ లో ఆసుపత్రి నడుస్తోంది. సిబ్బంది ఆరుబయటే వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో 10 పడకలు చెట్ల కింద వేశారు. రక్తం ఎక్కించడం.. సెలైన్ పెట్టడం.. డ్రెస్సింగ్ చేయడం వంటివన్నీ చెట్ల కిందే చేస్తున్నారు.
కీలకమైన ఫార్మసీ విభాగం కూడా ఆరుబయటే ఉంది. వాన వచ్చిందంటే ఆసుపత్రిని మూయాల్సిన పరిస్థితి. లోపల చిన్న గదిలో సహజ ప్రసవాలు మాత్రమే చేస్తున్నారు. మరో గదిలో వైద్యాధికారి, ఇంకో గదిలో ఎక్స్‌రే, మందుల స్టాక్ ఉంచుతున్నారు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ అటు వైద్య సిబ్బంది, ఇటు రోగులు, మధ్యలో మందులు… ఫలితంగా తీవ్ర ఇబ్బందులు! ఇలా సాగుతుంది పరిస్థితి!
దీంతో.. ఆరోగ్యశాఖామంత్రి ఇలాకాలోనే పరిస్థితి ఇలా ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 30పడకల ఆసుపత్రి నిర్మాణానికి ముప్పై నెలలు దాటడం ఏమిటంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దీంతో… విడతల రజనీ… ఏమీ విచిత్రం అంటూ ఆన్ లైన్ వేదికగా ప్రశ్నిస్తున్నారు!!