మూలిగే రాజోలు ఎమ్మెల్యేపై తాటికాయ!

ప్రస్తుతం డా. బీఆర్ అంబేధ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గ జనసేన/వైసీపీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. జనసైనికులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి గెలిపించుకున్న అనంతరం.. ఫ్యాన్ కిందకు చేరిపోవడంతో ఆయన బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందని చెబుతుంటారు. ఈ క్రమంలో… అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలతో రాసుకు పూసుకు తిరిగడంతో ఆ అనధికారిక ఫిరాయింపు కన్ ఫాం అయిపోయింది. ఈ క్రమంలో రాపాకాకు మరో తలనొప్పి స్టార్ట్ అయ్యింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ నేతలు తనకు ఓటుకు నోటు ఇస్తారని చెప్పినట్లు సంచలన ప్రకటన చేసిన రాపాక… అనంతరం తన సొంత ఊరిలో తన గెలుపులో దొంగఓట్ల పాత్ర కూడా ఉందన్నట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో… ఎన్నికల కమిషనర్ ఈ మేరకు ఆ సంగతేంటో చూసి తమకు నివేధిక ఇవ్వాలని.. కోనసీమ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆ సమస్యకు తోడు మరో కొత్త తలనొప్పి తోడయ్యింది!

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా.. మలికిపురం మండలం, కత్తిమండ గ్రామపంచాయతీ పరిధిలో ఎంపీ అభివృద్ధి నిధులు దుర్వినియోగం చేశారన్న ఫిర్యాదు నేపథ్యంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ పై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. నిధుల దుర్వినియోగంపై కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన ఎనుమల వెంకటపతిరాజా ఏప్రిల్‌ 11న సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖకు ఈ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయడంతో వ్యవహారం తెరపైకి వచ్చింది.

గ్రామంలో ప్రజల అవసరాల నిమిత్తం 12 లక్షల రూపాయలతో రహదారిని నిర్మించాల్సి ఉంది. అయితే ఆ సొమ్ముతో స్థానిక ఎమ్మెల్యే రాపాక.. కత్తిమండలో నూతనంగా నిర్మించుకున్న ఇంటి లోపల నుంచి రోడ్డు వేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే… ఈ విషయంపై స్పందించిన రాపాక… నిధులు దుర్వినియోగం చేయలేదని, తనను కలవడానికి వస్తున్న ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా తన ఇంటి లోపల రహదారిని నిర్మించినట్లు చెప్పడం గమనార్హం!

మరి ఇప్పటికే దొంగఓట్ల వ్యవహారంలో విచారణను ఎదుర్కొంటున్న రాపాకకు… ఈ కొత్త విచారణ ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి!