ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు హైద్రాబాద్ అపోలోలో చికిత్స

vellampalli srinivas

ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మెరుగైన వైద్యం కోసం బుధవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లారు. ఇటీవలే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కరోనా వైరస్ బారినపడి చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు జ్వరం, నీరసంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో మంత్రి చికిత్స పొందుతున్నారు.

vellampalli srinivas
vellampalli srinivas

ఇప్పటికే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా సోకింది. సెప్టెంబర్ నెలలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సెప్టెంబర్‌లో తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి వెల్లంపల్లి వారం రోజుల పాటు తిరుమలలోనే ఉన్నారు. సెప్టెంబర్ 25వ తేదీన విజయవాడకు చేరుకున్నారు. అప్పటి నుంచి ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో మంత్రికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో మంత్రి వెల్లంపల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది కోలుకున్నారు. ఈ తరుణంలో ఆరోగ్యం సరిగా లేకపోవడంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు.