అధికారికంగా తెలుగుదేశంలో ఉంటూ అనధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్న నలుగురు ఎమ్మెల్యేల మూలంగా జరుగుతున్న గొడవలు అన్నీ ఇన్నీ కావు. పార్టీ మారిన ఆ నలుగురి వలన వైసీపీలో అంతర్గత విబేధాలు రాజుకుంటున్నాయి. జంప్ కొట్టిన ఆ ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజవర్గాల్లో వైసీపీ కేడర్ మొత్తం తమ కనుసన్నల్లోనే ఉండాలన్నట్టు పట్టుబడుతున్నారు. యాడ్ కుదరకపోతే తమ వర్గాన్ని వైసీపీ ప్రధాన కేడర్ అన్నట్టు నడిపిస్తున్నారు. దీంతో అప్పటికే అక్కడున్న వైసీపీ లీడర్లు వారి మీద తిరగబడుతున్నారు. ఫలితంగా ఆ నియోజకవర్గాల్లో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయి కనబడుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవాలంటే జగన్ దృష్టిలో పడాలని తెగ పాకులాడుతున్నారు. వారిలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ప్రముఖంగా కనిపిస్తున్నారు.
తన ఇద్దరు కుమారులను వైసీపీలో చేర్చిన ఆయన పేరుకు టీడీపీ ఎమ్మెల్యేనే అయినా వైసీపీ కోసం పనిచేస్తున్నారు. పనిచేయడం అంటే అలా ఇలా కాదు అఫీషియల్ వైసీపీ ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా కష్టపడుతున్నారు. సౌత్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓడిన ద్రోణంరాజు వర్గం అలాగే ఉంది. ద్రోణంరాజు కుమారుడు రాజకీయాల్లోకి వస్తుండటంతో ఆయనే తమ నాయకుడని నిర్ణయించేసుకున్నారు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా ఎమ్మెల్యే అవ్వాలనే ఆశతో ఉన్న కోలా గురువులు కూడ నియోజకవర్గం మీద పైచేయి సాధించడం కోసం ట్రై చేస్తున్నారు. గత ఎన్నికల్లో ద్రోణంరాజు కోసం కోలాను పక్కనపెట్టారు జగన్. కానీ ఇటీవల ద్రోణంరాజు కాలం చేయడంతో ఇక ఆ స్థానం తనదేనని ఫిక్సయ్యారు కోలా. పైగా ఆయనే నియోజకవర్గ ఇంఛార్జ్ కూడ.
వీరందరినీ దాటుకుని వాసుపల్లి టికెట్ పట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తన పూర్వ గురువు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు పాలన మొత్తం అవినీతిమయం అంటున్నారు. హుదూద్ సమయంలో మత్స్యకారులకు సాయం చేయలేదని, చంద్రబాబు వద్దకు ఏ లేఖ తీసుకెళ్లినా ఐఏఎస్ ముందు పడేసేవారని తెలిపారు. ఐఏఎస్‌లు సరిగా పనిచేయరని విమర్శించారు. ఇప్పుడు పాలనలో ఎంతో మార్పు కనిపిస్తోందని సీఎం జగన్ సముద్రమైతే చంద్రబాబు పిల్ల కాలువ అని తీవ్రంగా దుయ్యబట్టారు. ఇన్నాళ్లు మనసు చంపుకుని బాబు ఒత్తిడితో జగన్ మీద విమర్శలు చేశానన్న ఆయన తన తప్పేమీ లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన దూకుడు చూసి ఎలాగిఆన్ బ్రేకులు వేయాలని డిసైడ్ అయ్యారు టీడీపీ, వైసీపీ లీడర్లు.
అందుకే చంద్రబాబు అంత అవినీతిపరుడని తెలిసినప్పుడు గత ఎన్నికల్లో టీడీపీ నుండి ఎందుకు పోటీకి దిగారు, ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు పేరు ఎందుకు చెప్పుకున్నారు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అంత నిజాయితీయే ఉంటే బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను ధిక్కరించాల్సింది. ఆధారాలతో సహా ఆయన అవినీతిని బయటపెట్టొచ్చు కదా. ఆయన ప్రతిపక్షంలో కూర్చున్నాకే మీ గొంతు పెగిలిందా. అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ టికెట్ మీదే గెలిచారు కాబట్టి ఆ పదవికి రాజీనామా చేయవచ్చు కదా అంటూ ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాసుపల్లి మాత్రం అవన్నీ పట్టించుకోవట్లేదు. పదవికి రాజీనామా అనే ఆలోచనే ఆయనలో లేదు. ఎవరెన్ని మాట్లాడుకున్నా జగనే తన నాయకుడని అంటున్నారు.