సిబిఐ లో లుకలుకలపై వైసిపి స్వరం పెంచింది. ఎప్పటినుంచో సిబిఐ విశ్వసనీయతను వైసిపి ప్రశ్నిస్తోంది. జగన్ కాంగ్రెస్ ను వీడిన కొద్దిరోజులకే సిబిఐ కేసులు పెట్టడం ఇది కుట్రలో భాగమే అని వైసిపి ఆరోపిస్తోంది. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో సిబిఐ ఎలా వాడుకుందో వైసిపి పదే పదే చెబుతూ వస్తున్నది. ఈ తరుణంలో సిబిఐ లో లుకలుకలు తారాస్థాయికి చేరి అరెస్టుల దాకా రావడం పై వైసిపి నాయకురాలు వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ వైసిపి కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విలేఖరులతో మాట్లాడుతూ సిబిఐ లుకలుకలు బయట పడుతున్నాయని ఆరోపించారు. సిబిఐ ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. సిబిఐని తమకు నచ్చని వారిపై ఉసిగొల్పుతున్నారని ఆనాడే మేము తెలిపామని గుర్తు చేశారు. టిడిపి నేతలకు ఈరోజే సిబిఐ గుర్తుకు వచ్చిందా అని ఆమె నిలదీశారు. ఆరోజు సిబిఐ మూడో కన్ను, ఈరోజు మీ జోలికి వస్తే ఛీబిఐయా అంటూ ప్రశ్నించారు. టిడిపి ఎంపీ సీఎం రమేష్ ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సిబిఐ…ఛీబిఐ అయ్యిందా అంటూ ఎద్దేవా చేశారు. సిబిఐ మాజీ జెడి లక్ష్మి నారాయణపై పలు విమర్శలు చేశారు.
దర్యాప్తు సంస్థలను తమ పనులు చేసుకోనివ్వడం లేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడి దర్యాప్తు సంస్థలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాబేదారులు ఉన్నారని, గతంలోనే కేంద్రానికి వైసిపి అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు. చంద్రబాబుపై సీబీఐకి కంప్లైంట్ చేస్తే కోర్టుకు వెళ్లెవరకూ ఏం చేయలేదని వెల్లడించారు. సీబీఐని భ్రష్టు పట్టించిన వ్యక్తుల నిగ్గు తేలాల్సి ఉందని తెలిపారు.
తుఫాను బాధితులకు సహాయక చర్యలు భేష్ అని సిబిఐ మాజీ జెడి లక్ష్మి నారాయణ కితాబివ్వడంతోనే వాళ్ళ బంధం తేటతెల్లం అవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు వైఎస్ జగన్ కేసులో మీడియా ఎదుట ఫోజులిచ్చిన జెడి, ఈరోజు చంద్రబాబును పొగడటం ఏంటని నిలదీశారు. సీబీలో జరుగుతున్న బాగోతాలను, లుకలుకలను బయట పెట్టి అన్ని కేసుల విచారణ పక్షపాతం లేకుండా జరగాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ సిద్ధంగా ఉందని వెల్లడించారు వాసిరెడ్డి పద్మ.