జనసేనాని ‘వారాహి’ మూలన పడిపోతుందా.?

వారాహి ఇప్పుడేం చేస్తోంది.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రలు వుంటాయా.? వుండవా.? అంతా గందరగోళమే.! ‘వ్యూహాలు నాకు వదిలెయ్యండి.. మీరైతే గ్రామ స్థాయిలో కష్టపడి పనిచెయ్యండి..’ అంటూ జనసేన అధినేత పదే పదే క్లాసులు తీసుకుంటున్నారు జనసేన శ్రేణుల్ని ఉద్దేశించి.

ఇంతకీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’పై ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిస్థాయిలో రాజకీయ యాత్రలు చేసేదెప్పుడు.? అసలు ఆ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది.? ఇదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మార్చి నెలాఖరు వరకు ‘వారాహి’పై జనసేన అధినేత రెగ్యులర్ యాత్రలకు శ్రీకారం చుట్టే అవకాశం లేదట. ఈలోగా ఓ నాలుగైదు యాత్రలైతే ఏపీలో వుంటాయట.. అవి కూడా వీకెండ్ యాత్రలని అంటున్నారు.

ఇలాగైతే ఎలా.? అని జనసేన శ్రేణులు చర్చించుకుంటున్నాయి. కానీ, ఈ విషయమై జనసేన అధినేతను ఆ పార్టీ శ్రేణులు ప్రశ్నించే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం జరుగుతున్నా.. అందుకు సమాయత్తమవడంలేదు జనసేన పార్టీ. మరోపక్క, నారా లోకేష్ పాదయాత్ర ‘యువగళం’ నీరసించిపోతోంది. ఈ రోజుల్లో పాదయాత్రలంటే అంతకన్నా ఖర్చు దండగ వ్యవహారాలు ఇంకేవీ వుండవు. యాత్రల కారణంగా వచ్చే పొలిటికల్ మైలేజీ కూడా ఎంత.? అన్నదానిపై స్పష్టత లేదు.

ఇదే విషయమై జనసేన అధినేత కూడా డైలమాలో పడిపోయారని తెలుస్తోంది. ఓ వైపు సినిమాలు ఎడా పెడా ఒప్పేసుకుంటున్నారాయె. ప్చ్.. ఈ మొత్తం గందరగోళంలో వారాహి సరిగ్గా వాడకుండానే మూలనపడిపోయేలా వుంది.