వారాహి జపం చేస్తోన్న వైసీపీ.! తగ్గేదే లేదంటున్నారెందుకు.?

‘ఆ వాహనంతో మాకేంటి సంబంధం.?’ అని ఊరుకోవాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేనాని వినియోగించనున్న వారాహి వాహనానికి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చింది. అక్కడికేదో జనసేన పార్టీకి వైసీపీ నేతలు స్టార్ క్యాంపెయినర్లన్న తరహాలో హంగామా నడిచింది. అంతే మరి, సోషల్ మీడియాలో ఓ వీడియోను జనసేనాని పోస్ట్ చేస్తే, వైసీపీ మంత్రులు అంతలా ఉలిక్కిపడాలా.?

అయ్యిందేదో అయిపోయింది.! ఇక్కడితో అయినా ‘వారాహి’ వివాదాన్ని వైసీపీ మర్చిపోతుందా.? అంటే, లేనే లేదు. ఇంకా ఇంకా వైసీపీ నేతలు ‘వారాహి’ గురించి మాట్లాడుతూనే వున్నారు. నిజానికి, జనసేన నేతలెప్పుడో ఆ వారాహి గురించి మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ తన సినిమా పనుల్లో తాను బిజీ అయిపోయారు.

వైసీపీ నేతలే ఇంకా వారాహిని పట్టుకుని వేలాడుతున్నారు. ఎక్కడిదాకా ఈ వారాహి వివాదం వెళుతుందట.? బహుశా, 2024 ఎన్నికలు జరిగేదాకా ఈ వారాహి రగడ కొనసాగేలానే వుంది. ఎందుకంటే, వారాహి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టనుంది. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది.

వైట్ నెంబర్ ప్లేట్‌తో ఈ వాహనానికి రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలంగాణ రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ వాహనానికి ఇబ్బందులు వుండకూడదు. కానీ, మా రాష్ట్రం వేరు.. మా నిబంధనలు వేరు.. అంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్. అసలు అలాంటి నిబంధనలు ప్రత్యేకంగా రవాణా శాఖకు సంబంధించి ఏ రాష్ట్రంలో అయినా వుంటాయా.? ఏపీలో తెలంగాణ వాహనాన్ని అడ్డుకుంటే, తెలంగాణలో ఏపీ వాహనాల్ని అడ్డుకోవాల్సి వస్తుందేమో.! అక్కడిదాకా పరిస్థితిని వైసీపీ తీసుకెళుతుందా.? అంటే, ఏమో.. ఏమైనా జరగొచ్చు.