వారాహి యాత్రపై ధర్మ సందేహం…!

జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వారాహి యాత్రకు డేట్ ఫిక్సయ్యింది. రూట్ మ్యాప్ కూడా తెరపైకి వచ్చింది. దానికి అనుగుణంగా తాజాగా కో-ఆర్డినేటర్ల లిస్ట్ కూడా విడుదలయ్యింది. సరిగ్గా మరో వారం రోజుల్లో వారాహి ఏపీ రోడ్లపై.. అది కూడా గోదావరి జిల్లా రహదారులపై హల్ చల్ చేయబోతుంది. ఈ సమయంలో ఒక కొత్త ధర్మ సందేహం తెరపైకి వచ్చింది.

రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ లు పొత్తులో పోటీచేయబోతున్నాయనే అధికారికంగా పవన్ కల్యాణ్, అనధికారికంగా చంద్రబాబు ఆల్ మోస్ట్ కన్ ఫాం చేసేశారు! ఇదే కొంతమంది జనసేన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. పైగా… జనసేన ప్రచార రథం వారాహి స్టీరింగ్‌ చంద్రబాబు చేతిలో ఉందనే వైసీపీ నేతల కామెంట్లు మరింతగా వారిని బాదిస్తున్నాయి. ఈ సమయంలో తెరపైకి వచ్చిన ఒక ధర్మ సందేహంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వారాహి రథంపై జనసేన ప్రచార యాత్ర గతంలో రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే నాటి వాయిదాలకు గల కారణాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. కొండగట్టు ఆంజనేయస్వామి గుడి నుంచి వారాహి రథంపై పవన్‌ కళ్యాణ్‌ ప్రచార యాత్ర ప్రారంభిస్తానని చెప్పి గతంలో ఆ యాత్రను వాయిదా వేశారు.

తీరా కారణం గురించి ఆరాతీస్తే… రాజధాని రైతుల పాదయాత్ర జరుగుతుంది కాబట్టి వారాహి వాహనంపై ప్రచార యాత్ర ఆపేయాలని చంద్రబాబు ఆదేశించడంతో పవన్‌ కల్యాణ్‌ కేవలం పూజలతోనే సరిపెట్టారనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తీవ్ర నిరాసకు లోనైన జనసైనికులు… ఈ విషయంపై కక్కలేక, మింగలేక ఇబ్బంది పడ్డారు!

ఆ తర్వాత రెండోసారి కూడా వారాహి వాహనంపై జనసేన ప్రచార యాత్ర ప్రారంభించాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించుకున్నారు. దీంతో జనసైనికులు మరోసారి ఉత్సాహం తెచ్చుకున్నారు. తిరుపతి నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతుందని కథనాలొచ్చాయి. అయితే ఈలోపు లోకేష్ యువగళం పాదయాత్ర తేదీలు తెరపైకి వచ్చాయి. దీంతో మరోసారి వారాహి షెడ్ కే పరిమితమైపోయింది!

అయితే మరోసారి వారాహి యాత్ర షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో… “ఈసారైనా కన్ ఫాం గా జరుగుతుందా?” అనే ధర్మ సందేహం వ్యతం చేస్తున్నారంట జనసైనికులు. అయితే ఈసారి మాత్రం అన్నీ ఆలోచించుకునే… ఒకటికి రెండుసార్లు అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లుగా జనసేన పెద్దల నుంచి సమాచారం అందుతుంది!

ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ వారాహి యాత్ర వాయిదా పడదని.. అనుకున్న తేదీల్లో, అనుకున్న రూట్లలో జరిగి తీరుతుందని పార్టీ పెద్దలు నమ్మకంగా చెబుతున్నారంట. ఇదే క్రమంలో… ఆ మేరకు “అన్ని అనుమతులూ” తీసుకున్నామని పార్టీ నుంచి కేడర్ కు కచ్చితమైన సమాచారం అందుతుందని తెలుస్తుంది. సో… ఈసారి వారాహి యాత్రపై ఎలాంటి ధర్మ సందేహాలు పెట్టుకోవద్దని… “రావడం ఒకటిరెండుసార్లు వాయిదా పడొచ్చు కానీ… రావడం మాత్రం పక్కా” అంటున్నారంట!