వారాహి యాత్ర కో-ఆర్డినేటర్లు వీరే… లిస్ట్ లో మిస్సయిన లాజిక్ ఇదే!

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని.. ఈ మేరకు జగన్ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఈ ఏడాది అక్టోబర్ నాటికి అసెంబ్లీని రద్దు చేయాలనే యోచనలో వైఎస్ జగన్ ఉన్నారని రకరకాల ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి. అయితే అలాంటి ఆలోచన ఏదీ తమకు లేదని ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ సంగతి అలా ఉంటే… వారాహి యాత్రకు కో-ఆర్డినేటర్ల లిస్ట్ విడుదల చేసింది జనసేన.

వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాదిలోనే ఏపీలో ఎన్నికలు ఉండబోతున్నాయి. ఇదే విషయాన్ని వైసీపీ నేతలు స్పష్టం చేశ్తున్నారు. అయితే ఎందుకైనా మంచిదని భావిస్తూ… డిసెంబరు లోనే ఎన్నికలు ఉన్నాయన్నట్లు ఫిక్సయ్యి మరీ ప్రచారానికి తెరలేపారు జనసేనాని. ఇందులో భాగంగా ఈ నెల 14నుంచి తూర్పుగోదావరి జిల్లానుంచి వారాహి యాత్రను ప్రారంభించబోతున్నారు.

ఈ నేపథ్యంలో వారాహి యాత్ర సాగే నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది జనసేన పార్టీ. నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున సీనియర్ నాయకులకు కో-ఆర్డినేటర్లుగా అపాయింట్ చేసింది. ముందుగానే రూపొందించుకున్న రూట్ మ్యాప్‌ కు అనుగుణంగా నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభలను నిర్వహించడం, వారాహి యాత్రకు భారీగా జనాన్ని సమీకరించడం వంటివి వీరి బాధ్యతలుగా ఉండబోతున్నాయి.

నర్సీపట్నం – బొలిశెట్టి సత్యనారాయణ, వంపూరు గంగులయ్య..

పాయకరావుపేట – గడసాల అప్పారావు, మూగి శ్రీనివాస్..

యలమంచిలి – బండ్రెడ్డి రామకృష్ణ, బేతపూడి విజయశేఖర్..

తుని – బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, తాతంశెట్టి నాగేంద్ర..

ప్రత్తిపాడు – చిలకం మధుసూదన్ రెడ్డి, అక్కల గాంధీ..

పిఠాపురం – బొమ్మిడి నాయకర్, చిల్లపల్లి శ్రీనివాస్..

కాకినాడ రూరల్ – నయూబ్ కమల్..

కాకినాడ అర్బన్ – గాదె వెంకటేశ్వర రావు..

ముమ్మడివరం – బొలిశెట్టి సత్యనారాయణ,

అమలాపురం – బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, సుందరపు విజయ్ కుమార్..

పి.గన్నవరం – గడసాల అప్పారావు..

రాజోలు – చిలకం మధుసూదన్ రెడ్డి సమన్వయకర్తలుగా అపాయింట్ అయ్యారు. ఇదే క్రమంలో… జనవాణి కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యతను డీ వరప్రసాద్‌ కు అప్పగించింది పార్టీ.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… పైన చెప్పుకున్న లిస్ట్ లో అంతా నాన్ లోకల్ నాయకులు గా ఉన్నారు! తాజాగా విడుదలయిన ఈ లిస్ట్ చూసిన జనసైనికులు ఫస్ట్ చేసిన కామెంట్ ఇదే కావడం గమనార్హం. స్థానిక నేతలకు ఈ బాధ్యతలు అప్పగించి ఉంటే… జనసమీకరణ మరింత సులువు అయ్యేదని.. దానికి తోడు కేడర్ లో కూడా స్థానిక నాయకత్వంపై ఒక అభిప్రాయం వచ్చేదని అంటున్నారు.

అలా కాకుండా… ఎక్కడో రాయలసీమ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, గుంటూరు నుంచీ తెచ్చి… గోదావరి జిల్లాల్లో సమన్వయ కర్తలుగా నియమించడం సరైన చర్య కాదని జనసైనికులు వాపోతున్నారు.