ఇప్పటికి రెండు దశలు పూర్తిచేసుకున్న వారాహి యాత్ర మూడో దశకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీ నుంచి సుమారు 9 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ పర్యటన ఉండబోతోంది. ఈ సందర్భంగా పవన్ వారాహియాత్ర వల్ల ఇప్పటివరకూ జనసేనకు ఒరిగిందేమిటి.. కార్యకర్తలకు కలిగిందేమిటి అనేది ఆసక్తిగా మారింది. దీంతో.. వారాహి 3.0 ఎలా ఉంటే బెటర్ అనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును… వారాహి 3.0 యాత్రకు జనసేన అధినేత పవన్ రెడీ అవుతున్నారు. ఈ నెల 10 నుంచి ఆయన యాత్ర చేయనున్నారు. అయితే.. ఈ యాత్ర ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు వారాహి యాత్ర పేరుతో రెండు జిల్లాల్లో ఆయన కలియదిరిగారు. ఈ యాత్ర పై ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసైనికులు పెద్దగా ఎలాంటి దిశానిర్దేశం చేయలేక పోయారనే వాదన వినిపించింది.
తొలిదశలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని సెలక్టివ్ నియోజకవర్గాల్లో వారాహి యాత్ర చేపట్టిన పవన్… అక్కడ కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడిని విమర్శించారు. ఫలితంగా వైసీపీ నాయకులతో డబుల్ డోస్ తీసుకున్నారు. అనంతరం మళ్లీ ఆ టాపిక్ ఎత్తింది లేదు. ఇదే సమయంలో ముద్రగడ వర్సెస్ జనసేనగా సాగిన వ్యవహారం సంగతి తెలిసిందే. ఫలితంగా… కాపుసామాజికవర్గ ఓట్లలో చీలికతెచ్చుకుంది జనసేన!
ఇక పశ్చిమగోదావరి జిల్లా యాత్రకు వచ్చేసరికి జనసేనకు, తన వ్యక్తిత్వానికీ కావాల్సిననంత డ్యామేజ్ చేసుకున్నారు పవన్ కల్యాణ్. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన… గతంలో ఎన్నడూ లేనంత డ్యామేజీ సంపాదించుకున్నారు. ఫలితంగా జనసైనికులను ఇరకాటంలో పాడేశారు. గ్రామాల్లో వారి పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారయ్యిందని అంటున్నారు!
ఇప్పుడు వారాహి 3.0 అంటున్నారు పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలను కవర్ చేయనున్నారు. అయితే ఇక్కడైనా పవన్ సరిగ్గా వ్యవహరిస్తారా.. జనసేన నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేస్తారా.. స్థానిక నాయకులకు, అట్ లీస్ట్ ఇన్ ఛార్జ్ లకు వారాహిపై స్థానం కల్పిస్తారా.. వారిని జనాలకు పరిచయం చేసి వారి గెలుపుకోసం పనిచేయమని సూచిస్తారా అనేది ఆసక్తిగా మారింది.
అలాంటి పనులేమీ చేయకుండా… కేవలం యాత్రలో పాటలు, కుర్రోళ్ల కేకలు, వాహనంపై పవన్ ఊరేగింపు, అనంతరం విమర్శల తాలింపు, వివాదాస్పద వ్యాఖ్యల మేళవింపుగా సాగితే మాత్రం జనసేన ప్రతిష్ట, పవన్ గౌరవం మరింత పాతాళానికి దిగజారడం మినహా… ఈ వారాహికి వాడిన డీజిల్ డబ్బుల ప్రతిఫలం కూడా దక్కదని అంటున్నారు పరిశీలకులు.
మరి ఈ సూచనలు పరిగణలోకి తీసుకుని… పవన్ తన పంథా మార్చుకుంటారా.. అవాకులూ చెవాకుల స్థానంలో కార్యకర్తలకు దిశా నిర్ధేశాలు చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.